
మణికట్టు కండరాలను సాగదీసే వ్యాయామం: ఇందుకోసం మీరు ముందుగా ఒక చేతిని ముందుకు చాపి, అరచేతిని కిందివైపు ఉంచాలి. తర్వాత వేళ్లు ముందుకు చూపేలా ఉంచి, మరో చేతితో వాటిని మెల్లగా మీ వెనక్కి లాగాలి. ముంజేయి పైభాగంలో స్వల్పంగా సాగదీసిన అనుభూతి కలిగే వరకు మాత్రమే చేయాలి. ఈ స్థితిలో 20–30 సెకన్ల పాటు ఉండాలి. తర్వాత అరచేతిని పైవైపునకు తిప్పి, మరో చేతి సహాయంతో వేళ్లను మెల్లగా వెనక్కి లాగాలి.

బొటనవేలి వ్యాయామం: ఈ వ్యాయామం కోసం అరచేతిని తెరిచి బొటనవేలి కొనతో చూపుడు వేలు కొనను తాకాలి. ఆ తర్వాత మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలును వరుసగా తాకాలి. ఇలా ఐదు నుంచి పది సార్లు చేయాలి. తర్వాత మరో చేతితో బొటనవేలిని మెల్లగా వెనుకవైపునకు సాగదీయాలి. బొటనవేలి అడుగు భాగంలో స్వల్పంగా లాగుతున్నట్లు అనిపించే వరకు మాత్రమే చేయాలి. ఇలా 15–20 సెకన్ల పాటు ఉండాలి. రోజుకు రెండు సార్లు చేస్తే సిరపోతుంది.

వేళ్ల స్నాయువులను కదిలించే వ్యాయామం: ఇందుకోసం వేళ్లను నిటారుగా ఉంచి.. ఆ తర్వాత వేళ్ల అడుగు కీళ్లను సాధ్యమైనంతవరకు నిటారుగా ఉంచుతూ, పై రెండు కీళ్లను వంచాలి. ఇలా చేస్తే చేతి వేళ్లు టేబుల్ ఆకారంలో కనిపిస్తాయి. తర్వాత వేళ్లన్నింటినీ వంచి పిడికిలి బిగించాలి. తర్వాత మళ్లీ వేళ్లను నిటారుగా చాపాలి. ఇలా ఐదు నుంచి ఎనిమిది సార్లు చేయాలి.

చేతులను తేలికగా ఊపుతూ మణికట్టును తిప్పే వ్యాయామం: ఇందుకోసం చేతులను శరీరానికి ఇరువైపులా వదులుగా ఉంచి.. చేతులకు అంటుకున్న నీటిని వదిలించుకుంటున్నట్లుగా సున్నితంగా 10–15 సెకన్ల పాటు చేతులను ఇదిలించాలి. తర్వాత అరచేతులను పైవైపునకు, ఆపై కిందివైపునకు తిప్పాలి. ఇలా సుమారు పది సార్లు చేస్తే సరిపోతుంది. సాధారణంగా ఒకే చేతితో ఫోన్ను ఉపయోగించే అలవాటు ఉంటే, మధ్యమధ్యలో మరో చేతితోనూ ఫోన్ను ఉపయోగించడం మంచిది.

వేళ్లను వెడల్పుగా చాపి, పిడికిలి బిగించే వ్యాయామం: ఇందుకోసం అరచేతిని తెరిచి, వేళ్లన్నింటినీ వీలైనంత వెడల్పుగా చాపాలి.అలానే మూడు నుంచి ఐదు సెకన్ల పాటు ఉండి, ఆ తర్వాత వేళ్లను సడలించాలి. ఇలా పది సార్లు చేయాలి. తర్వాత బొటనవేలిని మిగిలిన వేళ్లపైకి తీసుకువచ్చి, మెల్లగా పిడికిలి బిగించాలి. సుమారు ఐదు సెకన్ల పాటు అలాగే ఉంచి, ఆపై వేళ్లను పూర్తిగా తెరవాలి. ఈ ప్రక్రియను పది సార్లు పునరావృతం చేయవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించబడింది. వీటిని ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తీసుకొండి.