
ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత, మూడు టేబుల్ స్పూన్ల పొట్టు మినప్పప్పు వేసి స్టవ్ సిమ్ లో పెట్టి దోరగా వేయించాలి. సాయి మినప్పప్పు కన్నా పొట్టు మినప్పప్పు వాడితేనే ఈ అన్నం రుచిగా ఉంటుంది. మినప్పప్పు ఎర్రగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.

మినప్పప్పు మంచిగా వేగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 30 గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు, 10 ఎండుమిర్చి, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా వేగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత, ఈ వేయించిన దినుసులను మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అర టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఉప్పు వేయడం వల్ల కారప్పొడితో పాటు అన్నానికి మంచిగా పడుతుంది. ఈ కారం పొడిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత, 20 గ్రాముల జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. జీడిపప్పు ఐచ్ఛికం. పిల్లల కోసం అయితే జీడిపప్పు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. జీడిపప్పు వేగిన తర్వాత, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ, రెండు రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా వేసి అర నిమిషం పాటు వేపుకోవాలి. కారం పొడి వేగిన తర్వాత, బియ్యాన్ని ఉడికించి తీసుకున్న అన్నాన్ని పాన్ లో వేయాలి. స్టవ్ ని హై ఫ్లేమ్‌లో పెట్టి అన్నాన్ని కారంతో పాటు స్పీడ్‌గా కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి కలపడం వల్ల ఉప్పు, కారాలు అన్నానికి చక్కగా పట్టి మంచి రుచి వస్తుంది.

దీనిని మీరు బాగా కలిపిన తర్వాత, చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే మినప్పప్పు అన్నం సిద్ధం. ఈ మినప్పప్పు రుచితో తినేకొద్దీ తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది. ఇది లంచ్ బాక్సులకు ఇంకా భోజనాలకు మంచి ఎంపిక.