
పెళ్లి విందంటే నాలుగైదు వంటకాలతో సరిపెట్టుకోవడం కాదు.. గొల్లలమామిడాడలో ఏకంగా 200 రకాల పిండి వంటకాలతో పెళ్లి పెద్దలకు విందు పెట్టి గోదావరి మర్యాదను చాటారు..! వంటకాల లెక్క చూస్తేనే కళ్లు తిరిగేలా.. తింటే కడుపు నిండేలా.. ఈ విందు ఇప్పుడు వెరైటీగా మారింది..!

పెదపూడి మండలం గొల్లలమామిడాడలో జరిగిన పెళ్లి విందు ఇప్పుడు కాకినాడ జిల్లా అంతా హాట్ టాపిక్ గా మారింది. గోదారోళ్లంటే వెటకారమే కాదు, మమకారం కూడా మామూలుగా ఉండదని మరోసారి నిరూపించారు. పెళ్లి పెద్దల కోసం ఏకంగా 200 రకాల పిండి వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తిన్నవాళ్ల కడుపు నిండాలి, చూసినవాళ్ల కళ్లు చెదరాలి అన్నట్టుగా ఈ విందును ఎంతో ఘనంగా నిర్వహించారు.

సాధారణంగా పెళ్లి విందంటే నాలుగైదు వంటకాలతో సరిపెట్టేస్తారు. కానీ గొల్లలమామిడాడలో మాత్రం వంటకాల లెక్క చూస్తేనే కళ్లు తిరిగేలా ఏర్పాట్లు చేశారు. అరిసెలు, బూరెలు, గవ్వలు, కాజాలు, లడ్డూలు, జిలేబీలు ఇలా ఒక్కోటి ఒక్కో రుచితో 200 రకాల పిండి వంటలు వడ్డించారు. వాటితో పాటు రకరకాల పండ్లు, పండ్ల రసాలు కూడా ఏర్పాటు చేసి విందుకు మరింత వన్నె తెచ్చారు.

ఈ విందులో కేవలం వంటకాలే కాదు, వడ్డింపులో మర్యాద, ఆతిథ్యంలో ఆప్యాయత కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. పెళ్లి పెద్దలను ఎంతో గౌరవంగా ఆహ్వానించి, ప్రేమగా వడ్డించారు. ఒక్కో వంటకాన్ని ఎంతో శ్రద్ధగా తయారు చేయించారు. గోదావరి జిల్లాల ఆతిథ్యానికి ఇది నిదర్శనం అని అక్కడికి వచ్చిన బంధువులు, అతిథులు మెచ్చుకున్నారు.పెళ్లి పెద్దలకే ఇంత ఘనంగా విందు పెడితే, ఇంక పెళ్లికొడుకు, పెళ్లికూతురి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా అని అందరూ ముచ్చటపడ్డారు.

ఈ వెరైటీ విందు గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చి చూసి వెళ్లారు. వంటకాలను ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విందు వార్త వేగంగా వైరల్ అయింది.మొత్తానికి గొల్లలమామిడాడ విందు భోజనం వెరైటీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. 200 రకాల పిండి వంటలతో, పండ్లు రసాలతో ఔరా అనిపించిన ఈ పెళ్లి విందు గోదావరి ఆతిథ్యానికి సలాం కొట్టాల్సిందే అని అందరూ అంటున్నారు. ఈ విందు ఇప్పుడు ఆ ఊరికే కాదు, ఆ జిల్లాకే ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది.