
కావలసిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు, 3 కప్పులు జొన్న రవ్వ , మినప్పప్పు రుబ్బడానికి తగినన్ని చల్లటి నీళ్లు, రుచికి సరిపడా, దిబ్బరొట్టె కాల్చడానికి సరిపడా వంట నూనె తయారీ విధానం: ఒక పాత్రలో ఒక కప్పు మినప్పప్పును శుభ్రంగా కడిగి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి వేసవి కాలమైతే 3 గంటలు సరిపోతుంది. వేరొక గిన్నెలో ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పుల చొప్పున (1:3 నిష్పత్తి) జొన్న రవ్వను తీసుకోవాలి. రవ్వను రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి పప్పుతో పాటే 4 నుండి 5 గంటల పాటు నాననివ్వాలి .

నానిన మినప్పప్పును గ్రైండర్‌లో వేసి, కొద్దికొద్దిగా ఐస్ వాటర్ పోసుకుంటూ వెన్నలా నునుపుగా, ప్లఫ్ఫీగా రుబ్బుకోవాలి. ఈ మినప్పిండిని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన జొన్న రవ్వలోని నీటిని ఏమాత్రం లేకుండా చేత్తో గట్టిగా పిండి తీసి మినప్పిండిలో వేయాలి. రవ్వలో నీళ్లు ఉంటే పిండి పల్చబడిపోయి.. జొన్న రవ్వ గిన్నె అడుగుకు దిగిపోయి రొట్టె సరిగ్గా రాదు. పిండిని చేత్తో బాగా కలిపి, మూతపెట్టి రాత్రంతా వెచ్చని ప్రదేశంలో పులియనివ్వాలి.

మరుసటి రోజు ఉదయం చక్కగా పులిసిన పిండిలో సరిపడా ఉప్పు వేసి కలపాలి. స్టవ్‌పై మందపాటి ఇనుప బాండీ లేదా అట్ల పెనం పెట్టి 2-3 చెంచాల నూనె వేసి బాగా కాగనివ్వాలి. నూనె సరిగ్గా కాగిన తర్వాతే పెద్ద గరిటెతో రెండు మూడు గరిటెల పిండిని వేసి సమానంగా పరవాలి నూనె సరిగ్గా కాగకపోతే రొట్టె ఎర్రగా క్రిస్పీగా వేగదు.

మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పెనాన్ని అటూ ఇటూ కదుపుతూ రొట్టె అంతా సమానంగా కాలేలా చూసుకోవాలి. అంచులు వేగి విడివడుతున్నప్పుడు అట్లకాడతో నెమ్మదిగా రెండో వైపునకు తిప్పి మరో 2-3 నిమిషాలు ఎర్రగా కాల్చుకోవాలి.

అంతే, నోరూరించే క్రిస్పీ జొన్న దిబ్బరొట్టె సిద్ధం! ఘాటైన అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ లేదా నాటుకోడి పులుసుతో వేడివేడిగా తింటుంటే పైపెంకు కరకరలాడుతూ లోపల మృదువైన టెక్స్చర్‌తో అద్భుతమైన రుచినిస్తుంది!