
పనస ముక్కలు, 2 ఉల్లిపాయలు , 3 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు , పసుపు ,అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి, కారం తగినంత, అర టేబుల్ స్పూన్ గరం మసాలా , కొత్తిమీర, 2 స్పూన్లు జీడిపప్పు, గసగసాలు , నువ్వులు, ముందుగా పనస ముక్కలను మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా పసుపు, అర స్పూన్ ఉప్పు వేసి పనస ముక్కలను మీడియం మంటపై ఉడికించాలి. కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. పనస ముక్కలు బాగా ఉడకాలి, ఇలా చేయడం వల్ల కూరలో జిగురు, కండ్రు ఉండవు. ఉడికిన పనస ముక్కలను నీటి నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.

చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్ల జీడిపప్పు, ఒక స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే, ఒక స్పూన్ పుచ్చపప్పు, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటే కూరకి మరింత రుచి వస్తుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, సరిపడా నూనె వేసుకోవాలి. ఈ కూరకి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక, చిన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించుకోవాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు వేగిన తర్వాత, ముందుగా తయారుచేసుకున్న జీడిపప్పు-గసగసాల పేస్ట్‌ను వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ త్వరగా దగ్గరపడుతుంది కాబట్టి, అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి.

పేస్ట్ దగ్గరపడిన తర్వాత, ఉడికించుకున్న పనస ముక్కలను వేసి కలిపి, తగినన్ని నీళ్లు పోసి మరోసారి కలిపి మూత పెట్టి, మీడియం మంటపై సుమారు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ అడుగంటే అవకాశం ఉంటుంది.

పది నిమిషాల తర్వాత కూర చిక్కబడుతుంది. ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ముక్కలు, అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి, మూత పెట్టి నూనె పైకి తేలేవరకు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పనస ముక్కల మసాలా కూర సిద్ధం. ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ వంటి వాటితో ఆస్వాదించడానికి చాలా బాగుంటుంది