
మీ మాటలు వినేస్తున్న వాయిస్ అసిస్టెంట్స్: మనం ఫోన్‌తో పనిలేకుండా హే గూగుల్, సిరి అనో పిలవగానే పలుకుతాయి కదా? అలా పలకడానికి అవి 24 గంటలూ బ్యాక్‌గ్రౌండ్‌లో మీ మైక్రోఫోన్‌ను యాక్టివ్‌గా ఉంచుతాయి. అంటే మీరు పక్కన ఏం మాట్లాడుకుంటున్నా, ఏకాంతంగా ఎలాంటి ముచ్చట్లు పెడుతున్నా అది వింటూనే ఉంటుంది.. అందుకే మీకు అవసరం లేనప్పుడు ఈ వాయిస్ అసిస్టెంట్‌లను వెంటనే ఆఫ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ప్రైవసీ పెరగడమే కాదు, మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది.

చాలా యాప్స్‌కి మైక్రోఫోన్, కెమెరా పర్మిషన్లు అసలు అవసరమే ఉండదు.. కానీ పర్మిషన్లు అడిగి మరీ యాక్సెస్ చేస్తాయి. దీనివల్ల మీరు ఫోన్ పక్కన పెట్టినా కూడా కొన్ని యాప్స్ మీపై నిఘా వేసే ప్రమాదం ఉంది. వెంటనే మీ ఫోన్ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ లేదా పర్మిషన్ మేనేజర్ విభాగంలోకి వెళ్లి చెక్ చేయండి. ఏ ఏ యాప్స్ మీ కెమెరాను, మైక్‌ను వాడుతున్నాయో చూసి, అవసరం లేని థర్డ్ పార్టీ యాప్స్ పర్మిషన్లను వెంటనే డిసేబుల్ చేయండి.

మరోవైపు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? అనేది కూడా కొన్ని యాప్స్ నిరంతరం ట్రాక్ చేస్తుంటాయి. అందుకే లొకేషన్ సెట్టింగ్స్‌లో ఎల్లప్పుడూ అనుమతించే Always Allow ఆప్షన్ కాకుండా While using the app లేదా ప్రతిసారీ అడగండి అనే ఆప్షన్ పెట్టుకోవడం సురక్షితం. ఇది అనవసరంగా మీ లొకేషన్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

ఇక ఫోటోల విషయానికి వస్తే.. ఏదైనా ఒక ఫోటో అప్‌లోడ్ చేయడానికి కొన్ని యాప్స్ మీ మొత్తం గ్యాలరీ యాక్సెస్‌ను అడుగుతాయి. అలాంటప్పుడు మొహమాటం లేకుండా Selected Photos ఆప్షన్ ఎంచుకోండి. దీనివల్ల మీ పర్సనల్ ఫోటోలు సురక్షితంగా ఉంటాయి. అలాగే ఉపయోగంలో లేనప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ డేటాను షేర్ చేసే అనవసరమైన యాప్స్‌ను పూర్తిగా డిసేబుల్ చేయడం ముఖ్యం.

ఇక హోటళ్లు, రైల్వే స్టేషన్లు లేదా బహిరంగ ప్రదేశాలలో దొరికే ఉచిత వై ఫై చూసి మురిసిపోయి కనెక్ట్ అవ్వకండి. ఇలాంటి ఉచిత నెట్‌వర్క్‌ల ద్వారా మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఎంత అవసరమైనా మీ మొబైల్ డేటానే వాడుకోండి కానీ.. ఫ్రీ వై ఫైల జోలికి వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్ భద్రత మీ చేతుల్లోనే ఉంది కాబట్టి వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి.