
టీని మితంగా తాగడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మిమ్మల్ని బద్ధకం నుంచి కాపాడుతాయి. కానీ కొంతమందికి ప్రతి రెండు నుంచి మూడు గంటలకు టీ తాగాలని అనిపిస్తుంది. దీంతో వీరు రోజుకు ఎంత టీ తాగుతారో లెక్క ఉండదు.

అలాగే కొంతమందిలో వేసవిలో దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్‌ట్రిక్ వంటి సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొంతమంది లోనైతే టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి.. అతిగా టీ తాగడం మొదట శరీరాన్ని వేడిగా చేసే అనుభూతి కలిగించవచ్చు. అయితే, వేడి లోపలి ప్రతికూలతలు పెరగవచ్చు.

చక్కెర, కెఫిన్ కలిగిన టీ ఎక్కువగా తాగితే చర్మం పొడిబారడం, మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. వేసవి కాలంలో చర్మం ఇప్పటికే అధిక వేడికి గురవుతూ ఉంటుంది. దానికి తోడు పదే పదే టీ, కాఫీలు తాగుతూ ఉంటే, ఈ సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో 200 నుంచి 300 mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. మీరు రోజుకు ఐదు నుంచి ఆరు కప్పుల టీ తాగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ టీ తాగడం వల్ల మీ శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. నిద్రలేమి వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

వేసవిలో టీ తాగవచ్చు. కానీ ఒక మోతాడుకు మించి ఉండరాదు. డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు రావకుండా ఉండేందుకు, ఎక్కువ నీరు, నారింజ, హెర్బల్, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం మంచిది. అలాగే ఎక్కువ చక్కెర కలిగిన ఐస్ టీలు శరీరంలో ఉష్ణోగ్రతను కాస్త ఎక్కువగా పెంచుతాయి.