
మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మజ్జిగలోని వే ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పులియబెట్టిన పాల ఉత్పత్తులు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

వైద్యపరంగా చూస్తే.. జలుబు, దగ్గులు ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి. ఆహారం నేరుగా ఈ వ్యాధులను తీవ్రతరం చేస్తుందనడానికి ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పి. ప్రవీణ్ కుమార్ రెడ్డి వివరణ ప్రకారం.. మజ్జిగను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు, పైగా అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మజ్జిగ తాగాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా ఫ్రిజ్ నుండి తీసిన చల్లని మజ్జిగ తాగడం వల్ల గొంతు చికాకుకు గురై దగ్గు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న మజ్జిగనే వాడాలి. మజ్జిగలో అల్లం, మిరియాలు, జీలకర్ర వంటివి కలపడం వల్ల అది జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా, శరీరానికి హాయినిస్తుంది. అయితే రాత్రి సమయాల్లో కంటే, మధ్యాహ్న భోజన సమయంలో మజ్జిగ తీసుకోవడం ఉత్తమం.

ఎప్పుడు దూరంగా ఉండాలి?: అయితే అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు. మీకు తీవ్రమైన గొంతు నొప్పి, టాన్సిల్స్ వాపు లేదా జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు మజ్జిగకు దూరంగా ఉండటమే మంచిది. అలాగే, మజ్జిగ తాగిన వెంటనే లక్షణాలు పెరుగుతున్నట్లు అనిపిస్తే మీ వ్యక్తిగత సున్నితత్వాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.

జలుబు లేదా దగ్గు ఎక్కువ కాలం తగ్గకుండా వేధిస్తుంటే, అది ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అటువంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం.