
చాలామంది ప్యాకెట్ పాలను వాడిన తర్వాత మిగిలిన పాలను వేడి చేసి ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తారు. కానీ ఫ్రిజ్‌లో ఉంచినా కూడా, కొన్నిసార్లు ఆ పాలు విరిగిపోవడం లేదా పులిసిపోవడం జరుగుతుంటుంది. ఇందుకు ప్రధాన కారణం వాటిని సరైన పద్ధతిలో ఫ్రిజ్‌లో స్టోర్ చేయకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

అవును, చాలామంది పాలను ఫ్రిజ్‌లోని డోర్ షెల్ఫ్‌లో స్టోర్ చేస్తారు. కానీ ఇలా చేయడం తప్పు.. ఎందుకంటే డోర్‌ను మనం మళ్లీ మళ్లీ ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి, అక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి. దీనివల్ల పాలలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి పాలు త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పాలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో లోపల చల్లగా ఉండే షెల్ఫ్‌లోనే స్టోర్ చేయండి.

అంతేకాదు, చాలామంది పాలను మరిగించిన వెంటనే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇది కూడా మంచిది కాదు. ఎందుకంటే వేడి పాలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే పాత్ర లోపల తేమ పేరుకుపోయి, దాని నాణ్యతపై ప్రభావం పడొచ్చు. కాబట్టి మరిగించిన పాలను గది ఉష్ణోగ్రతకు చల్లార్చిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టండి.

అలాగే ఫ్రిజ్‌లో పెట్టిన పాలను మూత పెట్టకుండా ఉంచకండి. ఇలా చేయడం వల్ల అవి ఇతర ఆహార పదార్థాల వాసనలను పీల్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల బయటి సూక్ష్మజీవులు సులభంగా పాలలోకి చేరి అవి పాడైపోయేలా చేయవచ్చు. కాబట్టి పాలను ఎప్పుడూ మూత ఉన్న పాత్రలలో మాత్రమే ఫ్రిజ్‌లో స్టోర్ చేయండి.

మరో విషయం ఏమిటంటే చాలామంది ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లటి పాలను నేరుగా స్టవ్‌పై మరిగిస్తారు. ఇలా చేయడం వల్ల కూడా కొన్నిసార్లు పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పాలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి సాధారణ (గది) ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వాటిని మరిగించండి. ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మీరు రెండు మూడు రోజుల వరకు పాలను ఫ్రెష్‌గా వాడుకోవచ్చు.