
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బాస్మతి బియ్యం: 2 కప్పులు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, నూనె, జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు,బిర్యానీ ఆకు , లవంగాలు , యాలకులు , దాల్చిన చెక్క , స్టార్ ఎనైస్, మరాఠీ మొగ్గ, జాపత్రి , బగార పువ్వు , షాజీరా , జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ,అల్లం పేస్ట్,బంగాళదుంప , బీన్స్ ,క్యారెట్, బఠానీలు, టమాటా, ఉప్పు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా

తయారీలోకి వెళ్లితే.. ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి, నీరు పోసి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇది పులావ్ పొడిపొడిగా రావడానికి, త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది. తర్వాత బంగాళదుంప, బీన్స్, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను అన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాలి. అందులో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే నూనెలో బిర్యానీ ఆకు, చితగ్గొట్టిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఎనైస్, మరాఠీ మొగ్గ, జాపత్రి, బగార పువ్వు, షాజీరా, జీలకర్ర వేసి సువాసన వచ్చేవరకు దోరగా వేయించాలి.

తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బఠానీలు , బంగాళదుంపలు, టమాటా ముక్కలు వేసి రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీరు లేకుండా తీసి కుక్కర్లోకి వేయాలి. తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా వేసి, బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా గరిటెతో కలుపుతూ రెండు నిమిషాలు వేయించాలి.

తర్వాత బియ్యం ఉడకడానికి సరిపడ నీరు పోయాలి. వేయించుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టాలి. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత ఆవిరి పోయిన తర్వాత మూత తీసి మెల్లిగా కలపాలి. అంతే వెజిటేబుల్ పులావ్ రెడీ. ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటారు.