
కావాల్సిన పదార్థాలు : కంది పప్పు, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కారం, చింత పండు, ముల్లక్కాడలు, క్యారెట్, బీట్ రూట్, సోరకాయ ముక్కలు, ధనియాల పొడి, మొంతి పొడి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి మిర్చీ, ఆవాలు, శనగ పప్పు, మిననప్పు, ఇంగువ, ఉప్పు, నూనె.

తయారీలోకి వెళ్లితే.. సాంబార్ తయారీకి ముందుగా పప్పు ఉడికించుకోవాలి. ఒక కుక్కర్‌లో అర కప్పు కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన పప్పులో కందిపప్పు తీసుకున్న కప్పుతో రెండు కప్పుల నీళ్లు, పావు టీస్పూన్ పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మంచిగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని దానిని నానబెట్టి దాని నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్‌కు కావాల్సిన కూరగాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పావు టీస్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేయించాలి. మెంతులు బాగా వేగితేనే మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తర్వాత కూరగాయలు వేసి మంచిగా ఉడికించుకోవాలి.

కూరగాయలు సగం ఉడికిన తర్వాత మూడు టీస్పూన్ల కారం వేసి బాగా కలపాలి. కారం ముక్కలకు బాగా పట్టేంత వరకు లో ఫ్లేమ్‌లో కలిపి, ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోయాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. సాంబార్ కొద్దిగా పల్చగా ఉండాలి, ఎందుకంటే ఉడికేటప్పటికి చిక్కబడుతుంది. ఆ తర్వాత పాన్‌కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించాలి. కూరగాయలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి.

బాగా సాంబార్ ఉడుకుతున్న సమయంలో ధనియాల పొడి, మెంతి పొడి, ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపితే, గుమగుమలాడే ఫంక్షన్ స్టైల్ సాంబార్ సిద్ధం. ఈ సాంబార్ అన్నంతో పాటు వడ, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్‌లకూ అద్భుతంగా ఉంటుంది.