
ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం మరియు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం. మునుపటి రోజుల్లో యాభై ఏళ్లు దాటిన తర్వాత కనిపించే తెల్ల జుట్టు, ఇప్పుడు ఇరవై ఏళ్ల యువతలోనూ సర్వసాధారణంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నేటి ఆధునిక జీవనశైలిలో పెరిగిపోయిన మానసిక ఒత్తిడి (స్ట్రెస్). విపరీతమైన ఒత్తిడి వల్ల మన శరీరంలో 'కార్టిజాల్' అనే హార్మోన్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, వెంట్రుకలు రాలడం ప్రారంభమవుతుంది.

దీనికి తోడు శరీరంలో విటమిన్ డి లోపం కూడా తోడైతే, జుట్టు చాలా వేగంగా నెరిసిపోతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి స్థూల పోషకాల కంటే.. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ మరియు సెలెనియం వంటి సూక్ష్మ పోషకాల లోపం వల్లే ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే రసాయన రంగులు, షాంపూలు వాడుతుంటారు. కానీ వాటి వల్ల జుట్టుమరింత పాడయ్యే ప్రమాదం ఉంది.

దీనికి బదులుగా మన వంటింట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆయుర్వేద నిపుణులు ఒక అద్భుతమైన హోమ్ రెమెడీని సూచిస్తున్నారు. దీనికి కావలసినవి కేవలం మూడు పదార్థాలు. అవి మనకు సులభంగా దొరికే మందార పూలు, ఉసిరి పొడి (ఆమ్లా పౌడర్), మరియు ఆయుర్వేద మార్కెట్లో లభించే 'మండూర భస్మం'. మండూర భస్మం అనేది ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) నుండి ప్రత్యేక ప్రక్రియల ద్వారా తయారు చేయబడిన ఒక పవర్ఫుల్ ఆయుర్వేద ఔషధం. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి కొన్ని తాజా మందార పూలను తీసుకుని మెత్తని పేస్ట్‌లా నూరుకోవాలి. అందులో ఒక చెంచా ఉసిరి పొడి, కొద్దిగా మండూర భస్మం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు కుదుళ్లకు పట్టించి కాసేపు ఆరనివ్వాలి. వారంలో ఒకసారి ఈ విధంగా ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలంగా మారుతాయి.

అయితే నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేవి తాత్కాలికంగా జుట్టును సంరక్షించడానికి మరియు తక్షణ మార్పు కోసం మాత్రమే ఉపయోగపడతాయి. సమస్య శాశ్వతంగా తగ్గాలంటే శరీరానికి లోపలి నుండి పోషకాలు అందడం చాలా ముఖ్యం . యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు సరైన పోషకాహారంతో పాటు ఇంటర్నల్ మెడికేషన్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.