
కావలసిన పదార్థాలు మరియు వేయించే విధానం: ఈ హెల్తీ కారప్పొడిని తయారు చేయడానికి ముఖ్యంగా మూడు రకాల విత్తనాలు అవసరమవుతాయి. అవి పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు , మరియు పొద్దుతిరుగుడు గింజలు. ఇవి మనకు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీలో పావు కేజీ పుచ్చ గింజలను వేసి, మంటను చిన్నగా ఉంచి కరకరలాడే వరకు దోరగా వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే విధంగా గుమ్మడి గింజలను, అనంతరం సన్‌ఫ్లవర్ గింజలను కూడా మాడకుండా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ గింజలన్నీ సమాన పరిమాణంలోనే తీసుకోవాల్సిన పని లేదు, మన నచ్చినట్లు ఎక్కువ తక్కువగా కూడా వేసుకోవచ్చు. గింజలన్నీ వేయించి చల్లార్చుకున్నాక, అదే బాండీలో ఒక స్పూన్ నూనె వేసి 10 నుండి 15 ఎండుమిర్చి, ఒక టీస్పూన్ ధనియాలు, మరియు ఒక గుప్పెడు తాజా కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి.

ఇవి కాస్త వేగాక ఒక టీస్పూన్ జీలకర్ర కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆపేయాలి. మిర్చి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లోకి తీసుకుని తగినంత కల్లుప్పు వేసి మొదట బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న విత్తనాలను వేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి.

చివరగా ఇందులో ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి, మిక్సీని ఒకటి లేదా రెండు సార్లు ఆన్ చేసి ఆఫ్ (పల్స్) చేస్తే ఎంతో రుచికరమైన కారప్పొడి సిద్ధమవుతుంది. ఇలా పలుకులుగా ఉంటేనే అన్నంలోకి తింటున్నప్పుడు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మిగిలిన విత్తనాలను ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని పిల్లలకు రోజూ స్నాక్స్ లాగా కూడా ఇవ్వవచ్చు.

ఈ విత్తనాలలో విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడతాయి. ముఖ్యంగా హాస్టల్స్‌లో ఉండే పిల్లలకు లేదా ఆఫీసులకు వెళ్లే వారికి ఈ పొడిని చేసి ఇస్తే, వారు ప్రతిరోజూ ఎంతో సులభంగా పోషకాలను పొందవచ్చు. ఎల్లప్పుడూ ఒకే రకమైన పొడులు కాకుండా ఇలాంటి హెల్తీ వంటకాలను మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి.