
కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు అరకేజీ, సోంపు 1 టీస్పూన్, మిరియాలు పావు టీస్పూన్, యాలకులు 4, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, సొంటి లేదా అల్లం చిన్న ముక్క, తురిమిన బెల్లం అరకేజీ, కారం అర టీస్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టీస్పూన్, వేయించిన పుచ్చగింజలు 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్.

ముందుగా అరకేజీ తాజా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడవాలి. వీటిని ఇడ్లీ పాత్ర లేదా జాలి గిన్నెలో ఉంచి ఆవిరిపై కాస్త మెత్తబడే వరకు ఉడికించి చల్లారనివ్వాలి. ఉసిరికాయలు చల్లారేలోపు స్టవ్ మీద పాన్ పెట్టి సోంపు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, సొంటి ముక్క వేసి సన్నని మంటపై తేమ పోయేవరకు వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఉసిరికాయలను చేత్తో నొక్కితే ముక్కలు విడిపోతాయి; వాటిలోని గింజలను తీసేయాలి. తడి అస్సలు లేని మిక్సీ జార్‌లో ఈ ఉసిరికాయ ముక్కలను వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి. తర్వాత వెడల్పాటి పాన్‌లో రుబ్బిన ఉసిరికాయ ముద్ద, అరకేజీ తురిమిన బెల్లం వేసి మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి.

బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం చిక్కబడటం మొదలయ్యాక, ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అర టీస్పూన్ కారం, చిటికెడు ఉప్పు వేసి, మిశ్రమం చేతికి తీగపాకం వచ్చేంత వరకు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

వేడి మీద ఉన్నప్పుడే ఒక టీస్పూన్ నెయ్యి, మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పుచ్చగింజలు వేసి కలపాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. నిమ్మరసం కలపడం వల్ల ఉసిరికాయలోని వగరు తగ్గడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా గాజు సీసాలో భద్రపరుచుకుంటే బయట నాలుగు నెలలు, ఫ్రిజ్‌లో అయితే ఏడాది పాటు తాజాగా ఉంటుంది. రోజూ భోజనం తర్వాత ఒక స్పూన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.