
శనగలు, మన రోజువారీ ఆహారంలో ఒక సాధారణ భాగంగా ఉన్నప్పటికీ, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే సూపర్‌ఫుడ్‌గా పరిగణించవచ్చు. వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో, కూరలుగా లేదా వేయించి ఇలా వివిధ రకాలుగా తీసుకుంటారు. ఎలా తీసుకున్నప్పటికీ, శనగలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా మాంసం తినని వారికి శనగలు ప్రోటీన్ల అద్భుతమైన వనరు.. అని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు చెబుతున్నారు. ప్రతి రోజు ఒక కప్పు శనగలను తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

శనగలు రోగనిరోధక శక్తిని పెంచే దివ్యౌషధంలా పనిచేస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి సహాయపడతాయి. శనగల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు శనగల ద్వారా సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఈ పొటాషియం మన శరీరంలో రక్తపోటు (బీపీ)ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. నిత్యం శనగలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

శనగలు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.. ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి. ఒక రోజు శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్‌లో మూడో వంతు కేవలం 28 గ్రాముల శనగల్లోనే లభిస్తుంది. పొట్టు తీసిన శనగల కంటే పొట్టుతో కూడిన శనగలు మరింత ఆరోగ్యకరమైనవి. అయితే, వాటిని అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడవచ్చు.

మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి శనగలు చాలా మంచి ఆహారం. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే శనగలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్ లెవెల్స్) త్వరగా పెరగవు. పైగా, వీటిలో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది, ఇది రక్తంలో షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా, మధుమేహం అదుపులో ఉంటుంది.

శనగల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఎ, ఇ, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల సమ్మేళనం ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. అలాగే, శనగలు శరీరానికి ఐరన్‌ను ఎక్కువగా గ్రహించడంలో సహాయపడతాయి, దీనివల్ల రక్తహీనత (అనీమియా) సమస్య రాకుండా నివారించబడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల బలహీనత సమస్యలు రాకుండా చూస్తుంది.

శనగల్లో రాఫినోస్ అనే సాల్యూబుల్ ఫైబర్ ఉంటుంది.. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శనగల్లో ఉండే సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల గుండెపోటు (హార్ట్ ఎటాక్) వంటివి రాకుండా ఉంటాయి. సమృద్ధిగా ఉన్న ఫైబర్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపడంలో శనగలు అద్భుతంగా పనిచేస్తాయి. శనగలను నానబెట్టి, మొలకలు వచ్చాక పచ్చిగా తిన్నా లేదా వేయించుకుని ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరమే. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే.. ఏమైనా సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.