
ఇంట్లో బట్టలు ఉతకడం అనేది రోజువారీ పనుల్లో ఒక భాగం. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో బట్టలు ఉతకడానికి మార్కెట్లోకి రకరకాల డిటర్జెంట్లు వచ్చాయి. నార్మల్ వాషింగ్ పౌడర్, మెషిన్ మ్యాటిక్ పౌడర్, లిక్విడ్ డిటర్జెంట్.. ఇలా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనలో చాలా మంది ఏదైనా సర్ఫే కదా అని చేత్తో ఉతికే నార్మల్ పౌడర్‌ను వాషింగ్ మెషిన్‌లో వేస్తుంటారు. అయితే మీరు మీ బట్టలను, మీ విలువైన వాషింగ్ మెషిన్‌ను ప్రమాదంలో పడేస్తున్నట్లే..

హ్యాండ్ వాష్ పౌడర్: మనం చేతులతో బట్టలు ఉతకడానికి లేదా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల కోసం సాధారణంగా వాడే పౌడర్ ఇది. ఈ పౌడర్‌లో సర్ఫాక్టెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి నీటిలో కలవగానే విపరీతమైన నురగను పుట్టిస్తాయి. చేత్తో బట్టలు రుద్దేటప్పుడు ఎక్కువ నురగ ఉంటేనే మురికి సులభంగా వదులుతుంది. ఈ నార్మల్ పౌడర్‌ను పొరపాటున కూడా ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్లలో వేయకూడదు. ఎందుకంటే ఇందులోని విపరీతమైన నురగ మెషిన్ లోపల పైపులు, డ్రమ్, ఎలక్ట్రికల్ భాగాల్లోకి చేరి మెషిన్‌ను పాడు చేస్తుంది. బట్టలపై కూడా సర్ఫ్ మరకలు ఉండిపోతాయి.

మెషిన్ వాషింగ్ పౌడర్: ఇది ప్రత్యేకంగా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల సాంకేతికతకు అనుగుణంగా తయారు చేస్తారు. ఈ పౌడర్ తక్కువ నీటితో, మెషిన్ తిరిగే స్పీడ్‌ను బట్టి పనిచేస్తుంది. ఇది చాలా తక్కువ నురగను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ నురగ ఉన్నప్పటికీ బట్టల్లోని కఠినమైన మురికిని, మట్టి మరకలను లాగేసే యాక్టివ్ ఇంగ్రిడియంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. తెల్లటి బట్టలు ప్రకాశవంతంగా మెరవడానికి ఇది బెస్ట్ చాయిస్. మెషిన్ పౌడర్‌ను చేత్తో ఉతకడానికి వాడితే సరైన నురగ రాదు. పైగా ఇందులోని రసాయనాలు చేతుల చర్మానికి అలర్జీలు లేదా మంటను కలిగించవచ్చు.

లిక్విడ్ డిటర్జెంట్: ప్రస్తుతం మార్కెట్లో దీనికి క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ఇవి ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్లకు, ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ మెషిన్లకు అమితంగా సూట్ అవుతాయి. లిక్విడ్ డిటర్జెంట్లు నీటిలో చాలా వేగంగా 100శాతం పూర్తిగా కరిగిపోతాయి. బట్టలపై ఎలాంటి సర్ఫ్ పొడి మరకలు పడకుండా చూస్తాయి. నూనె, గ్రీజు వంటి జిడ్డు మరకలను వదిలించడంలో లిక్విడ్ నంబర్ వన్ అని చెప్పొచ్చు. రంగు బట్టల రంగు వెలిసిపోకుండా, బట్టల సున్నితత్వాన్ని కాపాడటంలో లిక్విడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మట్టి, మచ్చలు, తెల్ల బట్టల కోసం మెషిన్ వాషింగ్ పౌడర్ వాడండి. రంగు బట్టలు, జిడ్డు మరకలు, సున్నితమైన దుస్తుల కోసం లిక్విడ్ డిటర్జెంట్ బెస్ట్. ఇక చేత్తో నానబెట్టి ఉతికేందుకు కేవలం నార్మల్ హ్యాండ్ వాష్ పౌడర్ మాత్రమే వాడండి. బట్టల రకాన్ని బట్టి, మీ వాషింగ్ మెషిన్ మోడల్‌ను బట్టి సరైన డిటర్జెంట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. తప్పుడు పౌడర్ వాడి బట్టలను, మెషిన్‌ను పాడుచేసుకునే కంటే.. సరైన డిటర్జెంట్ వాడి మీ వాషింగ్ మెషిన్ జీవితకాలాన్ని పెంచుకోండి.