
గోంగూర రొయ్యల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు : రొయ్యలు అర కేజీ, గోంగూర రెండు కట్టలు , పచ్చి మిర్చీ, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, ఉప్పు, నూనె, కారం, మటన్ మసాలా.

తయారీ విధానంలోకి వెళ్లితే .. ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటికి కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన రొయ్యల వాసన పోయి, నీచు వాసన రాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇప్పుడు గొంగూర కట్టలు తీసుకొని, మంచిగా ఉన్న ఆకులను తుంచి పక్కన పెట్టుకోవాలి. వీటిని చాలా శుభ్రంగా కడిగి, నీరు పోయే వరకు ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత, స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో నూనె పోసి, గోంగూర ఆకు, మూడు పచ్చి మిర్చీ వేసి మంచిగా వేయించుకోవాలి. చిన్న ముద్దలా వచ్చే వరకు వేయించుకోవాలి.

తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమం వేసి మంచిగా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలను ఉడకబెట్టుకోవాలి. కుక్కర్‌లో రొయ్యలు వేసి, పసుపు, ఉప్పు, నీరు పోసి మంచిగా మెత్తగా ఉడక బెట్టుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో గోంగూర పేస్ట్ వేసి, మంచిగా వేయించుకొని, కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కారం, మసాలాలు వేసిమరో పావు గంట ఉడకబెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గోంగూర రొయ్యల ఫ్రై రెడీ.