
ప్రతి ఏరియాకి దానికంటూ ఒక ప్రత్యేకమైన చికెన్ కర్రీ ఉంటుంది.అలాగే, తమిళనాడులో చెట్టినాడ్ చికెన్, పంజాబ్‌లో బటర్ చికెన్ లాగే, తెలుగు రాష్ట్రాలలో ఘాటైన రుచి, అద్భుతమైన సువాసనతో కూడిన కొబ్బరి గసగసాల చికెన్ కర్రీ చాలా ఫేమస్. కొబ్బరి, గసగసాలను వేసి తయారుచేసే ప్రత్యేక మసాలా పేస్ట్ ఈ వంటకానికి మంచి రుచినిస్తుంది. ఇది పూరీలతో, బగారా అన్నంతో, లేదా వేడి వేడి అన్నంతో చాలా అద్భుతంగా ఉంటుంది.

ఈ కర్రీకి కావాల్సిన స్పెషల్ పేస్ట్ ముందుగా చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో యాలకులు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు , 4 మిరియాలు షాహీ జీరా వేసి, తక్కువ మంటపై దీనిని లైట్ గా వేయించుకోవాలి. అలాగే మసాలాలు కూడా మాడకుండా వీటిని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత, దీనిలో గసగసాలు , కొబ్బరి పొడి కలిపి, కొబ్బరి పొడి మంచి ఎరుపు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించాలి. ఇంకా గసగసాలు చిన్నవి కాబట్టి మాడకుండా వీటిని కలుపుతూ ఉండాలి.

బాగా వేగిన తర్వాత, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని చల్లార్చాలి. చల్లారిన తర్వాత, మొదట పొడిగా చేసి, ఆపై తగినంత నీరు కలిపి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో, నూనె 2 టేబుల్ స్పూన్లు వేసి వేడెక్కిన తర్వాత, సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను, తగినంత ఉప్పు వేసి, ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, నాలుగు పచ్చిమిర్చి వేసి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకటి నుండి రెండు నిమిషాలు వేయించాలి.

దీనిలో పావు టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించుకోవాలి. ఆ తరవాత, ముందుగా కడిగి చేసి పెట్టుకున్న ఒక కిలో చికెన్ ముక్కలను వేసి, నూనెలో ఐదు నుండి ఆరు నిమిషాల పాటు బాగా వేయించాలి. గ్రేవీ స్టైల్ కర్రీకి ఇది చాలా ముఖ్యం. చికెన్ ముక్కలు ఆయిల్ లో వేయించడం వల్ల అవి బయట వైపు కొద్దిగా ఫ్రై అయ్యి కర్రీ రుచిని మరింత పెంచుతాయి.

చికెన్ బాగా వేగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టీస్పూన్ల ధనియాల పొడి, ఒక కప్పు టొమాటో ప్యూరీ మరియు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల మసాలా పేస్ట్ వేసి, చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కొబ్బరి, గసగసాల పేస్ట్ వల్ల కర్రీ వెంటనే చిక్కబడుతుంది. చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టాలి. మీడియం మంటపై కనీసం పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. దీనివల్ల చికెన్ లోపల వరకు మెత్తగా ఉడుకుతుంది. పదిహేను నుండి 15 నిమిషాల తర్వాత, నూనె పైకి తేలుతుంది, అప్పుడు ఈ కూర మంచిగా ఉడికిందని అర్ధం. చివరిగా, ఉప్పు సరిచూసుకొని, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా వడ్డించాలి.