
మనం ఏమి పనికిరావని.. వేస్ట్ పడేసే గుడ్డు పెంకుల్లో కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి అనేక మూలకాలు సమృద్ధిగా ఉంటాయట. ఇవి మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా కీలకంగా పనిచేస్తాయట. వీటిని పొడిగా చేసి మొక్కలకు వేస్తే.. వాటి పెరుగుదలలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తుందట.

ఒక వేళ మీ గార్డెల్‌లో మీరు టమాటాలు, వంకాయలు, మిరపకాయలు వంటి మొక్కలు పెంచుతుంటే.. వాటిని ఈ గుడ్డు పెంకు ఎరువును ఉపయోగించండి. ఎందుకంటే ఈ మెక్కల్లో కాల్షియం లోపం కారణంగా పువ్వులు, పండ్లు తరచుగా కుళ్ళిపోతాయి. ఈ క్రమంలో గుడ్డు పెంకుల ఎరువు కలపడం వల్ల మట్టిలో కాల్షియం శాతం పెరిగి, మొక్కలకు బలం చేకూరుతుంది.

అంతేకాదు అవి కీటకాలను, జలగలను కూడా తరిమికొట్టడానికి సహాయపడతాయి. అయితే ఈ గుడ్డు పోట్టును మీరు రెండు రకాల ఎరువుగా వాడవచ్చు. వీటిని ఎండబెట్టి పొడిగా చేసి వాడవచ్చు. అలా కాకుండా వీటి పెంకులను పూర్తిగా నలపకుండా.. వాటిని అలానే మొక్కల మొదలు వద్ద వేయాలి. ఇలా చేయడం ద్వారా వాటి పదునైన అంచుల కారణంగా చీమలు, కొన్ని రకాల పురుగులు మొక్క మొదలు వరకు రాకుండా ఉంటాయి.

విత్తనాలను త్వరగా మొలకెత్తించడానికి కూడా ఈ గుడ్డు పొట్టును వాడవచ్చు. ఇందుకోసం గుడ్డు భాగాన్ని తీసివేసిన తర్వాత, అడుగుభాగంలో ఒక చిన్న రంధ్రం చేసి, దానిని మట్టితో నింపాలి. ఆ మట్టిలోనే విత్తనాలు నాటాలి. మొలకలు మొలకెత్తి పెరిగినప్పుడు, గుడ్డు పెంకు చెక్కుచెదరకుండా వాటిని ఒక పెద్ద కుండీలోకి లేదా బేసిన్‌లోకి మార్చాలి. ఇది మొలకల వేర్లు దెబ్బతినకుండా అవి పెరగడానికి సహాయపడుతుంది.

మీరు ఇంట్లో తయారుచేసుకునే సేంద్రీయ కంపోస్ట్‌లో ఎండిన గుడ్డు పెంకుల పొడిని కలపడం వల్ల కంపోస్ట్ నాణ్యత మెరుగుపడుతుంది. ఇది కంపోస్ట్‌లోని ఆమ్లత్వ స్థాయిని సమతుల్యం చేసి, దానిలోని కాల్షియం శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇలాంటి ఎరువును వాడడం వల్ల మొక్కలు త్వరగా పెరగడంతో పాటు తెగుళ్లు రాకుండా ఉంటాయి.