
తక్షణ శక్తినిచ్చే పండ్లలో అరటిపండు మొదటి వరుసలో ఉంటుంది. అందుకే చాలా మంది ఉదయం జిమ్‌కు వెళ్లాలన్నా లేదా ఆఫీస్ హడావిడిలో ఆకలి వేసినా వెంటనే అరటిపండు తినేస్తుంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండును చాలా మంది ఖాళీ కడుపుతో తింటారు. ఇలా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఇందులో ఉండే సహజ చక్కెరలు ఖాళీ కడుపుతో తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి, ఆ తర్వాత అంతే వేగంగా తగ్గించేస్తాయి. దీనివల్ల కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా విపరీతమైన అలసట రావడం జరుగుతుంది.

గుండె ఆరోగ్యంపై ప్రభావం: అరటిపండులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో మెగ్నీషియం, కాల్షియంల మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ఉండే ఆమ్ల స్వభావం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.

అరటిపండును నేరుగా ఖాళీ కడుపుతో తినడం కంటే ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండు ముక్కలను పెరుగులో లేదా ఓట్స్‌లో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. అలాగే పండులోని ఆమ్లత్వం తగ్గుతుంది. బాదం లేదా వాల్‌నట్స్‌తో కలిపి తినడం వల్ల శరీరానికి పోషకాలు నెమ్మదిగా అందుతాయి.

బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అరటిపండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సరే పరిమితంగా, సరైన సమయంలో తీసుకున్నప్పుడే అది ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి రేపటి నుండి మీ ఉదయం అలవాటులో ఈ చిన్న మార్పు చేసి చూడండి..