
కావలసిన పదార్థాలు: 30 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టిన 500 గ్రాముల చికెన్, కడిగి 1 గంట నానబెట్టిన బాస్మతి బియ్యం, 1½ కప్పుల నీళ్లు, సన్నగా పొడవుగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన 1 మీడియం సైజు టమాటా, 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు చిలికిన పెరుగు, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఎండిన దేశవాళీ గులాబీ రేకులు, 1 టేబుల్ స్పూన్ పుదీనా తరుగు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యి, తాలింపు కోసం: 6 లవంగాలు, 4 యాలకులు, 1 అంగుళం ముక్క దాల్చినచెక్క, 1 బిర్యానీ ఆకు, 1 టీస్పూన్ షాజీరా

తయారీ విధానం: అరకిలో చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి.. గిన్నెలో నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి చికెన్‌ను 30 నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టాలి. స్టవ్‌పై ప్రెజర్ కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 6 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చినచెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు, 1 టీస్పూన్ షాజీరా వేసి వేయించాలి.ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ చీలికలు వేసి.. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంటపై బాగా వేయించాలి. ఇది పులావ్ ఫ్లేవర్‌కు చాలా ముఖ్యం.

ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ గరం మసాలా మరియు తరిగిన 1 టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు 2 నిమిషాలు వేయించాలి.టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ ముక్కలను నీరు వడకట్టి కుక్కర్‌లో వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి చికెన్ ముక్కలను మసాలాలో 4 నిమిషాల పాటు వేగంగా వేయించాలి.చికెన్ వేగిన తర్వాత సరిగ్గా 1½ కప్పుల నీళ్లు పోయాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి బియ్యాన్ని వేయాలి.

ఇందులోనే పావు కప్పు చిలికిన పెరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ పుదీనా తరుగు మరియు 1 టేబుల్ స్పూన్ ఎండిన దేశవాళీ గులాబీ రేకులు వేయాలి. గరిటెతో బియ్యం మెతుకు విరిగిపోకుండా సున్నితంగా అంతా కలిసేలా కలపాలి.కుక్కర్ మూతపెట్టి లాక్ చేసి.. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి సరిగ్గా 3 విజిల్స్ రానిచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

ఆవిరిని బలవంతంగా తీయకుండా.. కుక్కర్‌ను కనీసం 30 నిమిషాల పాటు కదపకుండా అలాగే వదిలేయాలి. గులాబీ రేకులు వేయని వారు మూత తీసిన తర్వాత అర టీస్పూన్ రోజ్ వాటర్ చల్లుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి గరిటె వెనుక భాగంతో అడుగు నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి.అంతే, నోరూరించే సూపర్ టేస్టీ 'ఈజీ చికెన్ పులావ్' సిద్ధం! ప్రతి అన్నం మెతుకూ విడివిడిగా పొడిపొడిగా ఉంటూ, చికెన్ ముక్కలు వెన్నలా సాఫ్ట్‌గా కరిగిపోతూ గులాబీ సువాసనతో వీకెండ్ భోజనానికి పరిపూర్ణమైన తృప్తినిస్తాయి!