
జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంటే.. హార్మోన్ల అసమతుల్యత, PCOS కారణం కావచ్చు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి దారితీయవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, ఐరన్, ప్రోటీన్ లోపాలు ఉన్నవారు, అధిక ఒత్తిడికి గురయ్యేవారికి జుట్టు రాలడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం.. వేసవిలో కూడా జుట్టుకు నూనె పెట్టడం ప్రయోజనకరమే. ముఖ్యంగా కొబ్బరి నూనె జుట్టు మూలాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టు విరిగిపోకుండా పెళుసుగా మారకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, జుట్టుకు అవసరమైన తేమను అందించడంలో నూనె కీలక పాత్ర పోషిస్తుంది.

చాలా మందికి రాత్రిపూట తలకు నూనె రాసుకుని, ఉదయాన్నే తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే వేసవిలో ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాక్స్ హాస్పిటల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య గుప్తా ప్రకారం.. రాత్రంతా నూనెను జుట్టులో ఉంచడం వల్ల మలాసెజియా గ్లోబోసా అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన చుండ్రుకు దారితీస్తుంది. జిడ్డుగా ఉన్న తల చర్మంపై వేసవిలో దుమ్ము, చెమట త్వరగా పేరుకుపోతాయి. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోయి జుట్టు రాలడం పెరుగుతుంది.

వేసవిలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలస్నానం చేయడానికి కేవలం రెండు గంటల ముందు మాత్రమే నూనె రాసుకోండి. ఇది జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. వేసవిలో చిక్కటి నూనెల కంటే బాదం లేదా కొబ్బరి నూనె వంటి తేలికపాటి నూనెలను ఎంచుకోవడం ఉత్తమం. నూనె రాసేటప్పుడు వేళ్లతో మెల్లగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు దృఢంగా మారుతుంది.

వేసవిలో జుట్టు సంరక్షణ అనేది కేవలం నూనె రాయడమే కాదు, సరైన పద్ధతిలో రాయడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, రాత్రంతా నూనె ఉంచే అలవాటుకు స్వస్తి చెప్పి, స్నానానికి ముందు మాత్రమే రాసుకుంటే మీ జుట్టు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.