
మన దేశంలో తండ్రి ఆస్తిలో కూతురి వాటా గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. తండ్రి వాటాపై పిల్లలందరికి హక్కు ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో ఆస్తి మొత్తం కొడుకే తీసేసుకుంటారు.. దీంతో కూతుళ్లు తమ వాటా కోసం కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కొన్నిసార్లు ఈ వివాదాలు కారణంగానే కుటుంబాల్లో గొడవలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చట్టప్రకారం తండ్రికి పుట్టిన వారిలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనే విషయం చూసుకుంటే.. సాధారణంగా తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాల్లో ఆస్తి గొడవలు స్టార్ట్ అవుతాయి. అయితే తండ్రి బతికుండగానే ఆస్తిలో వాటా అడగవచ్చా? అంటే అవును తండ్రి బతికున్న సమయంలోనే ఆస్తిలో వాటా అడిగే హక్కు కుమార్తెకు ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం కొడుకు, కూతురు ఇద్దరికీ తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. కాబట్టి కూరుతు ఎప్పుడైనా తండ్రి వాటాలో ఆస్తిని అడగవచ్చు. కానీ ఆస్తి రకాన్ని బట్టి ఇక్కడ రూల్స్ మారుతాయి.

ఒక వేళ మీ తండ్రి పేరుపై ఉన్న ఆస్తి.. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది కనుక అయితే.. దానిపై కూతుళ్లకు కూడా పూర్తి హక్కు ఉంటుంది. ఇలాంటి ఆస్తిని అమ్మాలనుకుంటే తండ్రి కచ్చితంగా పిల్లల అనుమతి తీసుకోవాలి. కాబట్టి తండ్రి బతికున్నప్పుడే కూతురు తన వాటాను డిమాండ్ చేయవచ్చు. ఒకవేళ తండ్రి ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తే, కూతుళ్లు కోర్టు ద్వారా దాన్ని పొందవచ్చు.

అలా కాకుండా మీ తండ్రిపేరుపై ఉన్న ఆస్తి.. ఆయన సొంతంగా సంపాధించింది అయితే దానికి రూల్స్ వేరుగా ఉంటాయి. ఆయన సంపాధించిన ఆస్తిపై పూర్తి హక్కు ఆయనకే ఉంటుంది. ఆయన పిల్లల అనుమతి లేకుండానే ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు. ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఆస్తిని తమకు రాసి ఇవ్వాలని కొడుకులు, కూతుళ్లు డిమాండ్ చేయడానికి వీలులేదు. తండ్రి తన ఇష్టమైన వారికి ఆ స్తిని రాసివ్వవచ్చు.

అయితే పొరపాటున తన ఆస్తి ఎవరికి చెందాలని తండ్రి వీలునామా రాయకుండా కనుకు మరణిస్తే.. ఆయన పేరుపై ఉన్న ఆస్తి.. ఆయన భార్య, కొడుకు, కూతుళ్లకు సమానంగా పంపిణీ అవుతుంది. కాబట్టి ఆస్తి ఉన్నవారు కుటుంబ పెద్దలు బతికుండగానే వీలునామా రాసి పెట్టడం ద్వారా ఫ్యూచర్లో పిల్లల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. ఈ చట్టాల గురించి జనాలకు సరైన అవగాహన లేకపోవడం వల్లే తరచూ గొడవలు జరుగుతుంటాయి.