
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి నాలెడ్జ్ సిటీ వరకు నిరంతర వన్‌వే లూప్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.

ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే వన్‌వే లూప్.. ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్‌లోని సీ-గేట్, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మీదుగా కొనసాగుతుంది. అనంతరం మై హోమ్ భూజా వద్ద కుడివైపు మలుపు తీసుకుని తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా మార్గాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా రహదారుల వెడల్పును సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు కీలక జంక్షన్ల వద్ద వాహనాల రద్దీ, ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించి సాఫీగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) సున్‌ప్రీత్ సింగ్, సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఎస్సీఎస్సీ సీఈవో నవీద్ ఖాన్‌తోపాటు సంబంధిత బృందం ప్రతిపాదిత మార్గంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న రహదారి మౌలిక సదుపాయాలు, జంక్షన్ల వద్ద ఎదురవుతున్న సమస్యలు, వాహనాల రాకపోకలకు ఉన్న అడ్డంకులను బృందం పరిశీలించింది.

తదుపరి దశలో వాహనాల వేగం, ట్రాఫిక్ సాంద్రత, రాకపోకల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థలు, స్థానిక భాగస్వాములతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, సూచనలను సేకరించనున్నారు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తుది ప్రణాళికను ఖరారు చేయనున్నారు.

వన్‌వే లూప్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ తెలిపారు. అన్ని భాగస్వామ్య వర్గాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అమలు ప్రణాళికను ఖరారు చేస్తామని పేర్కొన్నారు.వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అడ్వైజరీలు, రూట్ డైవర్షన్లకు సంబంధించిన అధికారిక వివరాలను ముందుగానే వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఐటీ కారిడార్‌లో పీక్ అవర్స్ ట్రాఫిక్ రద్దీ తగ్గి, ఉద్యోగులు, ఇతర వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరమయ్యే అవకాశం ఉంది.