
ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది.. ఓ వైపు మన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయని సంతోషపడాలో.. లేదంటే పెద్ద సినిమాలేవీ చెప్పిన టైమ్‌కు రావట్లేదని బాధ పడాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఫ్యాన్స్. టాలీవుడ్‌లో ప్రస్తుతం వాయిదాల పర్వం నడుస్తుంది. ఒకటి రెండు కాదు.. చాలా సినిమాలు చెప్పిన తేదీ కాకుండా మరో డేట్‌కు వెళ్లిపోతున్నాయి.

ఈ వాయిదాల పర్వానికి ఆధ్యుడు ప్రభాస్. గత పదేళ్లుగా బ్లాక్‌బస్టర్స్ అయితే ఇస్తున్నారు కానీ ఒక్క సినిమాను కూడా చెప్పిన తేదీకి అయితే తీసుకురాలేదు రెబల్ స్టార్. రాజా సాబ్‌కు ఇదే కంటిన్యూ అవుతుంది. 2024 సమ్మర్ అన్నారు.. ఆ తర్వాత 2025 సంక్రాంతి అన్నారు.. ఎప్రిల్ 10 అన్నారు.. ఇప్పుడా రోజు కూడా డౌటే. జులై 18 లేదంటే ఆగస్ట్ 14.. ఈ రెండు డేట్స్‌లో ఒకరోజు రాజా సాబ్ రానున్నాడు.

ప్రభాస్ ఒక్కడే కాదు.. పవన్ కళ్యాణ్ కూడా కేరాఫ్ పోస్ట్ పోన్‌గా మారుతున్నారు. ఈయన పొలిటికల్ కమిట్‌మెంట్స్ కారణంగా ఏ సినిమా చెప్పిన తేదీకి రావట్లేదు. మార్చ్ 28న హరిహర వీరమల్లు పక్కా అన్నారు. కానీ ఇప్పుడది కష్టమే. పైగా అదేరోజు నితిన్ రాబిన్ హుడ్ సినిమా ప్రకటించారు. చూస్తూ చూస్తూ పవన్‌తోనే నితిన్ అయితే పోటీకి రాడు కదా.. పైగా అక్కడున్నది మైత్రి మూవీ మేకర్స్.

మార్చ్ 29న మ్యాడ్ 2 రానుంది. ఈ లెక్కన VD12 కూడా మార్చ్ 28 నుంచి పోస్ట్ పోన్ అయినట్లే. ఈ 2 సినిమాలు నిర్మిస్తున్నది సితార ఎంటర్‌టైన్మెంట్సే. ఒకేరోజు గ్యాప్‌లో 2 సినిమాలైతే విడుదల చేయరు కదా.. అంటే VD12 మరో డేట్‌కు వెళ్లిందన్నమాట.

ఇక సంక్రాంతి నుంచి వాయిదా పడ్డ విశ్వంభర, మాస్ జాతర సినిమాలకు ఇంకా డేట్స్ కన్ఫర్మ్ కాలేదు.