
ఓటీటీ వేదికలపై విభిన్నమైన కాన్సెప్ట్‌లతో రూపొందే హారర్, ఫాంటసీ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. తాజాగా ఓ తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టిన ఒక్క రోజులోనే విశేషంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిద్ధి ఇద్నానీ, అంజలి నాయర్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటించిన 'డ్రోన్స్' చిత్రం నవంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రైమ్ వీడియోలో విడుదలైన కొద్ది సమయంలోనే 'డ్రోన్స్' మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రొమాన్స్ మూవీస్ విభాగంలో ఇది నంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండటంతో వివిధ భాషల ప్రేక్షకులు దీనిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. 'బన్ బటర్ జామ్' ఫేమ్ దర్శకుడు ఆర్. రాఘవ్ మిర్దత్ తన రెండో చిత్రంగా 'డ్రోన్స్'ను తెరకెక్కించారు.

అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు సానుకూల స్పందన వచ్చింది. అయితే సరిగ్గా ఒక్క రోజు ముందే పెద్ద సినిమా 'జైలర్ 2' విడుదల కావడంతో, 'డ్రోన్స్'కు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదని, ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రన్ అందుకోలేదని టాక్. దీంతో అప్పుడు థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐఎండీబీలోనూ 7.4 రేటింగ్‌తో మంచి టాక్ సొంతం చేసుకోవడం ఈ చిత్రానికి ఓటీటీలో మరింత ప్లస్‌గా మారింది.

హారర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలను కలగలిపి దర్శకుడు ఈ కథను ఆసక్తికరంగా మలిచారు. కాలేజీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు విద్యార్థులు ఒక విచిత్రమైన శాస్త్రవేత్త ఇంట్లో తలదాచుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. మూఢనమ్మకాలు, జాతకాలను వ్యతిరేకించే ఆ శాస్త్రవేత్త పద్మనాభన్.. మనుషుల్లా భావోద్వేగాలు పండించే హ్యూమనాయిడ్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉంటాడు.

మరోవైపు నిద్రలో నడిచే అలవాటున్న విద్యార్థి, మినియేచర్ ఆర్టిస్ట్ ప్రకృతి, ఆమె వెంట ఉండే మంత్రగత్తె, ఆత్మలు బందీగా ఉన్న బొమ్మల ఇల్లు, ప్రేమ శాపంతో బాధపడే పోలీసు అధికారి, ప్రేమలో పడ్డ మగవాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె.. ఇలా విభిన్న పాత్రల మధ్య అల్లుకున్న మలుపులు, క్లైమాక్స్‌లోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది.