
ఇటీవలి కాలంలో మలయాళ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా విభిన్నమైన కథాంశాలు, మిల్కీ ట్విస్టులతో కూడిన మర్డర్ మిస్టరీ, రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలను ఇక్కడి సినీ ప్రియులు అస్సలు వదలడం లేదు. థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన మలయాళీ క్రేజీ హిట్ మూవీ 'అంచక్కల్లకోక్కన్'. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని 'చాప్రా మర్డర్ కేస్' పేరుతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ మొత్తం 1980వ దశకం నేపథ్యంలో, కేరళ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో అత్యంత ప్రభావవంతమైన, ధనవంతుడైన భూస్వామి 'చాప్రా' (శ్రీజిత్ రవి) ఒక రాత్రి దారుణంగా హత్యకు గురవుతాడు. సరిగ్గా అదే సమయంలో, తీవ్రమైన నత్తి , పిరికితనంతో బాధపడే వాసుదేవన్ (లుక్మన్ అవరన్) అనే యువకుడు ఆ ఊరి పోలీస్ స్టేషన్‌కు కానిస్టేబుల్‌గా కొత్తగా డ్యూటీలో చేరుతాడు.

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, ఆ హత్య కేసును ఎలాగైనా త్వరగా క్లోజ్ చేయాలని స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు భావిస్తారు. ఈ క్రమంలో ఒక కమ్మరి తానే ఆ హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లోంగిపోతాడు. అయితే, పైకి కనిపిస్తున్నట్లుగా ఈ కేసు అంత సులభం కాదని, దీని వెనుక ఎన్నో ఏళ్ల నాటి పగలు, ప్రతీకారాలు, మోసాలు ఉన్నాయని వాసుదేవన్‌కు అర్థమవుతుంది. ఆ విచారణ క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి.

చివరకు తనలో దాగున్న భయాన్ని, కోపాన్ని అణచుకున్న ఆ పిరికి కానిస్టేబుల్.. తన అసలు రూపాన్ని బయటకు తీసి ఈ నేరాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను ఎలా అంతమొందించాడు అనేదే మిగిలిన కథ. ఉల్లాస్ చెంబన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా థ్రిల్లర్‌లో లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. సాధారణంగా ఒక మర్డర్ మిస్టరీ కథనంలో కేవలం క్రైమ్ మాత్రమే ఉంటుంది, కానీ ఈ సినిమాలో దర్శకుడు రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌ని అద్భుతంగా మిక్స్ చేశారు.

సినిమా ప్రారంభం నుండి చివరి దాకా వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుడికి మైండ్ బ్లాక్ అయ్యే కిక్ ఇస్తుంది. నటీనటుల సహజ సిద్ధమైన నటన, మణికందన్ అయ్యప్ప అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. థియేటర్లలో యావరేజ్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, ఓటీటీ వీక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 'చాప్రా మర్డర్ కేస్' (అంచక్కల్లకోక్కన్) సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.