
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి. అందులో తన సినిమా ప్రస్థానం, చిత్రాల పట్ల తన ఆలోచనలపై కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. లీడర్ తర్వాత వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక చిత్రాల పట్ల ఆయన జడ్జిమెంట్‌పై వచ్చిన విమర్శలను శేఖర్ కమ్ముల తోసిపుచ్చారు. తాను ఒక కథకుడు, చిత్రనిర్మాతగా ఎప్పటికీ తన అంతరాత్మ ప్రబోధం మేరకే సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక లాభాల కోసమో, ఈఎంఐలు కట్టడానికో సినిమాలు తీయనని చెప్పారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒక పొరపాటు అని అంగీకరించినప్పటికీ, అది తన జడ్జిమెంట్ లోపం కాదని, సినిమా నిర్మాణం అనేది కేవలం ఒక నిర్ణయం కాదని వివరించారు. కొంత గందరగోళం ఉన్నప్పుడు అటువంటి చిత్రాలు వస్తాయని పేర్కొన్నారు. అనామిక చిత్రం విషయానికి వస్తే, నిర్భయ ఘటనతో మహిళా సమస్యలపై తాను ప్రేరణ పొంది, ఆ చిత్రానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. తెలుగులో అటువంటి కథలు కొంత డేంజర్ అని తాను మేకర్స్‌కు చెప్పినప్పటికీ, నయనతారతో కాంబినేషన్ కావాలని వారు కోరుకున్నారని వెల్లడించారు.

శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రం ఫిదాపై పూర్తి నమ్మకంతో ఉన్నానని అన్నారు. తాను ప్రేమకథలను అద్భుతంగా తెరకెక్కించగలనని, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ వంటి చిత్రాలు అందుకు నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్కరూ తనను లవర్ బాయ్ దర్శకుడని పిలవడం ఇష్టం లేకపోయినా, ఈ ఫిదా కథ తనకు బాగా నచ్చినందున మళ్ళీ ఒక ప్రేమకథను తీస్తున్నట్లు చెప్పారు. ఫిదా చిత్రం సంప్రదాయ విలన్లు లేకుండా, పాత్రల మధ్య సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందని వివరించారు. కథలోని క్యారెక్టర్లు బలంగా ఉంటాయని, US, తెలంగాణ నేపథ్యాలు ఇందులో సగం సగం ఉన్నాయని తెలిపారు.

ఫిదా కథను మొదట మహేష్ బాబుకు వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. అయితే, డేట్స్ సమస్యల కారణంగా, ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుందనే కారణంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలిపారు. స్టార్ హీరోల నిర్ణయాలు వారి చేతుల్లోనే ఉండవని, మార్కెట్ డిమాండ్లు, మునుపటి చిత్రాల విజయం, బడ్జెట్, జానర్ వంటి అనేక అంశాలు వారి నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. గతంలో సమంత-మహేష్ బాబు బ్యాక్‌గ్రౌండ్‌పై తాను చేసిన వ్యాఖ్యల కారణంగా మహేష్ బాబును కలిసేటప్పుడు కొంత భయపడ్డానని, అయితే మహేష్ బాబు చాలా కూల్‌గా, దాన్ని పెద్ద విషయంగా భావించకుండా తనను స్వాగతించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

తన జానర్‌కు చెందిన సినిమాలను ఒక స్టార్ అంగీకరించడం పెద్ద విషయం అని, మహేష్ బాబు నిర్ణయాన్ని చెప్పుకొచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా 2012లో విడుదలైంది. 'హ్యాపీ డేస్' వంటి భారీ విజయం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉండేవి. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అమల, శ్రియా కీలకపాత్రలు పోషించగా.. కొత్త తరం తారలతో తెరకెక్కించారు. . దాదాపు లక్ష మందిని స్క్రీనింగ్ చేసి కొత్తవారిని ఎంపిక చేయడం ఒక పెద్ద సవాల్ అని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయం సాధించలేదని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు.