
స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు ప్రజలకు ఆమె యాంకర్ గా సుపరిచితమే. బిగ్ బాస్ షో ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన స్రవంతి.. ప్రస్తుతం యాంకర్ గా, నటిగా బిజీగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వెండితెరపై సందడి చేస్తున్నారు.

స్రవంతి కెరీర్ ప్రారంభంలో రాజశేఖర్ నటించిన 'మహంకాళి' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. అయితే, వివాహం తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో, ఆమె ఒక జ్యూయెలరీ షాపులో సేల్స్ గర్ల్ గా కూడా పని చేశారు.

గంటల కొద్దీ నిలబడటం కష్టమైనప్పటికీ కుటుంబం కోసం ఆ పనిని కొనసాగించారు. ఆర్థిక పరిస్థితులే ఆమెను తిరిగి ఇండస్ట్రీ వైపు నడిపించాయి. ఈసారి నటిగా కాకుండా యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తన వాక్చాతుర్యంతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' లో రెండుసార్లు పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా వేడుక జరిగినా స్రవంతి ఉండాల్సిందే అన్నంతగా ఆమె బిజీ అయిపోయారు. కేవలం యాంకరింగ్ కే పరిమితం కాకుండా, స్రవంతి ఇప్పుడు నటిగా కూడా రాణిస్తున్నారు.

ఇటీవల సుహాస్ నటించిన హే బలవంత్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక సాదాసీదా అమ్మాయి నుంచి, సేల్స్ గర్ల్ గా పనిచేసి, నేడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా ఎదగడం వెనుక స్రవంతి పడ్డ కష్టం అపారం.