
టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రెజీనా కసాండ్రా. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన రెజీనా.. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. చిన్న వయసులోనే కెమెరా ముందు కనిపించిన ఆమె.. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే పిల్లల టీవీ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించింది. తన చలాకీ మాటలు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అప్పట్లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టింది. టీనేజ్‌లోనే తమిళ చిత్రంలో కీలక పాత్ర పోషించి వెండితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.

2012లో వచ్చిన ‘శివ మనసులో శ్రుతి’ సినిమాతో రెజీనా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు, ఈ సినిమాతోనే సైమా ఉత్తమ తొలి నటి అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత రెజీనా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘కొత్త జంట’, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘నక్షత్రం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తన గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

దక్షిణాదిలో సినిమాలు చేస్తూనే రెజీనా బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. 2019లో విడుదలైన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా.. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. వీరిద్దరూ గతంలో ‘కేడీ బిల్లా కిల్లాడి రంగా’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా రోజులను గుర్తు చేసుకున్న రెజీనా.. శివకార్తికేయన్‌లో అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మార్పు కనిపించదని చెప్పింది. అప్పట్లో ఆయనను చూసినప్పుడు భవిష్యత్తులో ఇంత పెద్ద స్టార్ హీరో అవుతారని తాను ఊహించలేదని తెలిపింది. సినిమా రంగంలో నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయం కాదని చెప్పిన రెజీనా.. శివకార్తికేయన్ మాత్రం అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొంది. అయితే ఆయన ఈ స్థాయికి ఎలా చేరుకున్నారో, అందుకోసం ఎలాంటి కష్టపడ్డారో తనకు పూర్తిగా తెలియదని సరదాగా చెప్పుకొచ్చింది.