
తెలుగు సినిమా పరిశ్రమలో "సీత" వంటి బలమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి, 2016లో విడుదలైన అల్లు అర్జున్ చిత్రం "సరైనోడు"లోని ఐటెం సాంగ్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. తనను ఆ క్యారెక్టర్‌లో చూసిన వారు "అంజలినేనా?" అని కళ్లు నలుముకుని చూశారని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఈ ఐటెం సాంగ్‌ను ఒప్పుకోవడానికి గల కారణాలను, షూటింగ్ అనుభవాలను, అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసిన తీరును అంజలి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సాధారణంగా నటిగా ఒక ఇమేజ్ ఉన్నప్పుడు ఐటెం సాంగ్స్ చేయడానికి చాలా ఆలోచిస్తారు. అయితే అంజలి ఈ పాటను ఒప్పుకోవడానికి వెనుక పెద్దగా ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేశారు. "నాకు సడన్‌గా నచ్చింది చేయాలనిపించింది. పాట చాలా బాగా నచ్చింది. సరదాగా ఉంటుంది కదా, ఒకసారి ప్రయత్నిద్దాం అనిపించింది" అని ఆమె వెల్లడించారు. అదృష్టవశాత్తు ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతో ఆమె నిర్ణయం సరైనదని రుజువైంది.

ఈ పాట కోసం అంజలి ఎంత కష్టపడ్డారో ఆమె మాటల్లోనే తెలిసింది. "ఆ సాంగ్‌కి నేను యాక్చువల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశాను. ఎందుకంటే, అప్పుడు నాకు ఆ సాంగ్, బాలకృష్ణ గారితో చేసిన డిక్టేటర్ ఇంటర్వెల్ బ్లాక్ కలిపి సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉండేది" అని తెలిపారు. రాత్రిపూట "సరైనోడు" పాట షూటింగ్‌లో పాల్గొని, మరుసటి రోజు ఉదయం "డిక్టేటర్" టాకీ పోర్షన్ షూట్‌కు వెళ్లడం, తిరిగి వచ్చి రాత్రి "సరైనోడు" సాంగ్ షూట్ చేయడం ఇలాగే చేశామని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను తన అలసటను గమనించి, "చాలా టైర్డ్‌గా ఉన్నారు, వెళ్లి ఒక గంట విశ్రాంతి తీసుకోండి" అని చెప్పడం తనకు ఇప్పటికీ బాగా గుర్తుందని అంజలి పేర్కొన్నారు.

అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆయన డాన్స్ స్పీడ్ గురించి అందరికీ తెలుసు. అంజలి కూడా ఈ విషయంపై స్పందించారు. "నార్మల్‌గా డాన్స్ చేయడం వేరు. కానీ వాళ్ళు నాకు ఫస్ట్ ఆ సాంగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడే బన్నీ ఒక మూమెంట్ చేస్తారు, దానికి ఆపోజిట్‌గా మీరు ఇంకొక మూమెంట్ చేస్తారు. ఆయనకి పోటీగా మీరు, మీకు పోటీగా ఆయన చేస్తారు అని చెప్పారు. అది నాకు కొత్తగా అనిపించింది" అని ఆమె వివరించారు. అల్లు అర్జున్ అంత బాగా డాన్స్ చేస్తారు కదా, నేను ఆయనకు పోటీగా చేయగలనా అనే ఆలోచన మొదట తన మనసులో వచ్చిందని అంజలి చెప్పారు. అయితే, ప్రాక్టీస్, రిహార్సల్స్ తర్వాత "ఓకే, చేయగలను" అనే నమ్మకం కలిగిందని తెలిపారు.

అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి అంజలి మాట్లాడారు. "బన్నీ చాలా స్వీట్, వెరీ వెరీ స్వీట్. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయన సహనటులను గౌరవిస్తారు. షాట్ పర్ఫెక్ట్‌గా రావాలని మాత్రమే ఆయన కోరుకుంటారు. టేక్ యువర్ టైమ్, కంగారు పడకండి, కరెక్ట్‌గా రావాలి అని అంటారు. ఆయనలో నాకు నచ్చిన ఒక మంచి విషయం అది" అని అంజలి ప్రశంసించారు. "సరైనోడు" ఐటెం సాంగ్ విజయం, ఆ పాట కోసం తాను పడ్డ కష్టం, అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసిన ఆనందం అన్నీ తన సినీ ప్రస్థానంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోయాయని అంజలి అన్నారు.