
మధుమేహం తో బాధపడుతున్న వారికి సొంపు నీరు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా తోడ్పడుతుంది. సొంపు గింజల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా సొంపు నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. మరిన్ని ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.

బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్: సొంపు గింజలలో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: డయాబెటిస్ ఉన్నవారిలో జీర్ణసంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సొంపులో ఉండే ఈస్ట్రోగోల్, ఫెంచోన్, అనిథోల్ వంటి నూనె కాంపౌండ్లు జీర్ణరసాల స్రవాన్ని పెంచుతాయి. ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గడానికి దోహదం: అధిక బరువు అనేది టైప్-2 డయాబెటిస్‌కు ప్రధాన కారణాలలో ఒకటి. సొంపు నీరు శరీరంలో మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఇది ఆకలిని అదుపులో ఉంచి, శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు అదుపులో ఉంటే షుగర్ లెవెల్స్ కూడా త్వరగా అదుపులోకి వస్తాయి.

ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సొంపు గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టుకుని తాగవచ్చు. లేదా రాత్రంతా నానబెట్టిన నీటిని నేరుగా కూడా తాగవచ్చు. అయితే, సొంపు నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, పరిమితికి మించి తాగకూడదు. అలాగే ప్రెగ్నెంట్ మహిళలు, ఇప్పటికే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం శ్రేయస్కరం.