
ఆర్బీఐ ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం నుంచి కూడా ఆర్బీఐకు అనుమతి వచ్చింది. దీంతో ఆర్బీఐ తయారీ పనులను ముమ్మరం చేసింది. ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ త్వరలోనే ప్రారంభించనుండగా.. ఇప్పటికే పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. త్వరలోనే టెండర్లను ఖరారు చేయనుండగా.. అనంతరం ప్రింటింగ్ మొదలుపెట్టనుందని తెలుస్తోంది

అయితే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఎప్పుడు చలామణిలోకి తీసుకొస్తామనే విషయంపై ఆర్బీఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచే వీటిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. కొన్ని దేశాల్లో పాలిమర్ నోట్లు 30 ఏళ్లకుపైగా మన్నిక కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

తక్కువ విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్ల వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నాటికి వీటిని తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. తొలుత రూ.10, రూ.20 నోట్లను ఆర్బీఐ తీసుకురానుంది. అనంతరం వీటి ద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి మిగతా కరెన్సీ నోట్లను కూడా చలామణిలోకి తీసుకొచ్చే అవకాశముంది. వీటి వల్ల నకిలీ నోట్ల బెడద కూడా ఎక్కువగా ఉండదు.

పాలిమర్ నోట్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లు త్వరగా చినిగిపోతున్నాయి. అలాగే వాతావరణంలోని తేమ, దుమ్ము, ధూళి వల్ల త్వరగా పాడైపోతున్నాయి. అయితే ప్లాస్టిక్ నోట్ల వల్ల అలాంటి ఇబ్బంది ఉండదు. బాగా ధృఢంగా ఉంటాయి గనుక ఎన్ని ఏళ్లు ఉన్నా అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు అలాగే పాడవ్వకుండా ఉంటాయి.

వివిధ దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇవి 30 ఏళ్లకుపైగా చలామణిలో ఉన్నాయి. పేపర్ కరెన్సీ కంటే వీటి మన్నిక 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ముందుగా రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ఆర్బీఐ విడుదల చేయనుంది. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో్ వాటి మన్నిక, ఇతర అంశాలను తనిఖీ చేయనున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత తక్కువ మొత్తంలో నోట్లను ప్రవేశపెట్టనున్నారు.