
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దేశీయంగా మనీ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మనీ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చడం, కస్టమర్లకు రక్షణ కల్పించడం కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్ విడుదల చేసింది. మనీ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత భద్రపరచడం, కస్టమర్ల గుర్తింపును సరిగ్గా ధృవీకరించడం,మోసపూరిత లావాదేవీలను గుర్తించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.

డబ్బు అందుకునే వ్యక్తికి బ్యాంక్ ఉంటే ఉండి మీకు లేకపోతే మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నెఫ్ట్ ద్వారా నగదు రూపంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా ఒక లావాదేవీలో గరిష్టంగా రూ. 50 వేల వరకు పంపవచ్చు. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు(BC)పాయింట్లు, ATMల ద్వారా ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 5 వేల వరకు బదిలీ చేయవచ్చు. డబ్బు అందుకునే వ్యక్తికి బ్యాంక్ ఖాతా లేకపోయినా కూడా నిధులు పంపవచ్చు.

బ్యాంక్ అకౌంట్ లేనివారికి బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా డబ్బులు అందించవచ్చు. ఎలా అంటే డబ్బు పంపే వ్యక్తి బ్యాంకింగ్ కరస్పాండెంట్‌కు నగదును అందించాలి. ఆ తర్వాత కరస్పాండెంట్ డబ్బు అందుకునే వ్యక్తికి నగదు రూపంలో అందిస్తారు. ఈ రూపంలో ఒక్కొ లావాదేవీకి గరిష్టంగా రూ. 10 వేలు వరకు పంపవచ్చు. నెలకు మొత్తం రూ. 25 వేల వరకు మాత్రమ పంపుకోవచ్చు.

డబ్బు పంపేవారు తమ ధృవీకరించబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. అలాగే అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. డబ్బు ఎవరు పంపుతున్నారో సరిగ్గా గుర్తించడం, నకిలీ గుర్తింపులను ఉపయోగించి జరిగే లావాదేవీలను నిరోధించేందకు కేవైసీ పత్రాలు అందించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ట్రాన్స్‌ఫర్‌కు ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి.

ఈ సేవలు తప్పనిసరిగా ఉచితంగా అందించానలని ఆర్బీఐ ఎలాంటి నిబంధన పెట్టలేదు. ట్రాన్స్ఫర్లకు బ్యాంకులు, సంబంధిత సంస్థలు సేవా ఛార్జీలను వసూలు చేస్తాయి. కాబట్టి, డబ్బు పంపే ముందు ఆ లావాదేవీకి ఎంత ఛార్జ్ వర్తిస్తుందో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.