
దీపావళి పండుగ వస్తుండటంతో ఇప్పటినుంచే టపాసులు పేల్చడం చాలామంది మొదలుపెడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. బాణసంచా పేలుస్తూ కుటుంబంతో కలిసి పండుగ జరుపుకుంటారు. అయితే కొన్నిసార్లు బాణసంచా కాలుస్తున్నప్పుడు పొరపాటు వల్ల గాయపడే అవకాశముంటుంది. పెద్ద గాయాలైతే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు హాస్పిటల్ ఖర్చులు వేలల్లో అవుతుంటాయి.

వైద్య భారం తగ్గించుకునేందుకు ప్రస్తుతం మార్కెట్లోకి ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్సులు వస్తున్నాయి. టపాసులు పేలుస్తూ గాయపడితే ఈ వైద్య బీమా వర్తిస్తుంది. ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. ఇందుకోసం ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఫోన్ పే ప్రత్యేక ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ తన ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.11 ప్రీమియం చెల్లించి ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బాణసంచా వల్ల ప్రమాదం జరిగి గాయపడితే వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల వరకు పొందవచ్చు.

బాణసంచా వల్ల కాలిన గాయాలు, ప్రమాదాలకు ఈ కవరేజీ వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ద్వారా పాలసీదారుడితో పాటు పిల్లలు, జీవిత భాగస్వామికి కూడా బీమా కవరేజీ పొందవచ్చు. 24 గంటలుపైబడి ఆస్పత్రిలో ఉన్నా లేదా డే కేర్ చికిత్సకు ఈ ప్రయోజనం పొందవచ్చు. ఈ ఇన్సూరెన్స్‌లో రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. ఒకటి 11 రోజుల ప్లాన్ కాగా.. మరొకటి 30 రోజుల విస్తృత ప్లాన్ అందుబాటులో ఉంది.

11 రోజుల ప్లాన్ కొనుగోలు చేసిన 11 రోజుల వరకు మాత్రమే కవరేజీ అందిస్తుంది. ఆ తర్వాత కవరేజీ లభించదు. దీపావళికి ముందే ఈ పాలసీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ పొందవచ్చు. ఇక 30 రోజుల ప్లాన్ పండుగ సీజన్ మొత్తానికి కవరేజీ అందిస్తోంది. దీని ప్రీమియం ధర రూ.21గా ఉంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. దీపావళి నెల మొత్తం టపాసులు పేల్చేవారికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ గరిష్టంగా రూ.25 వేల వరకు వైద్య చికిత్స కోసం చెల్లిస్తారు.

ఫోన్ పే యాప్‌లోకి వెళ్లి సులువుగా ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. సెర్చ్‌లో ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. అనంతరం ప్లాన్‌ను సెలక్ట్ చేసుకుని మీ వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయాలి. అనంతరం పేమెంట్ చేస్తే సరిపోతుంది. పాలసీకి సంబంధించిన వివరాలు మీకు మెయిల్ ద్వారా అందుకుంటారు. ఆ వివరాల ఆధారంగా మీరు ఆస్పత్రిలో చేరితే క్లెయిమ్ చేసుకోవచ్చు.