
దీపావళి పండుగ వచ్చేయడంతో దేశంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. గోల్డ్ కొనేందుకు జనం షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో బంగారం దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఈ డిమాండ్ కారణంగా సోమవారం నుంచి పసిడి ధరలు కూడా మరింత పెరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా బంగారం కొంటే మంచి జరుగుతుందని చాలామంది బలంగా నమ్ముతారు. దీంతో ఈ పండక్కి తమ స్తోమతకు తగ్గట్లు ఎంతోకొంత గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే గోల్డ్ కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. లేకపోతే మోసపోయే అవకాశముంటుంది. ముఖ్యంగా చిన్న దుకాణాల నుంచి కొనుగోలు చేసేముందు మరింత అప్రమత్తంగా ఉండాలి. హాల్ మార్క్ ఒక్కటే చూసుకుంటే సరిపోతుందని చాలామంది వినియోగదారులు అనుకుంటారు. కానీ హాల్ మార్క్ ఒక్కటే చూసుకుంటే సరిపోదు.. మీరు కొనే బంగారం స్వచ్చమైనదా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొన్ని మార్గాల ద్వారా మీరు దీనిని గుర్తించొచ్చు.

నకిలీ బంగారాన్ని అరికట్టి స్వచ్చమైన బంగారాన్ని వినియోగదారులకు అందేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి చేసింది. ఈ గుర్తు మీరు కొనేది స్వచ్చమైన నిజమైన బంగారం అని నిర్దారించుకునేందుకు ఉపయోగపడుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్కింగ్ అందిస్తుంది. అయితే కొంతమంది నకిలీ హాల్ మార్క్‌లను కూడా ఉపయోగించవచ్చు. దీంతో కేవలం ఆ గుర్తు ఒక్కటి చూసుకుంటే సరిపోదు. హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కూడా చెక్ చేయాలి.

హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ అనేది ప్రతీ బంగారు ఆభరణానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది అక్షరాలు, నెంబర్లను కలిగి ఉంటుంది. మొత్తం ఆరు అంకెల ఆల్పాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. మీరు బీఐఎస్ కేర్ మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ఓపెన్ చేసి మీరు కొనుగోలు చేసే బంగారు ఆభరణంపై ఉండే కోడ్‌ను ఎంటర్ చేయాలి. దీంతో ఆ ఆభరణానికి సంబంధించిన సమాచారం మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

నగల వ్యాపారి రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు బంగారం స్వచ్చత, హాల్ మార్కింగ్ ఎక్కడ నిర్వహించారు..? హాల్ మార్కింగ్ జరిపిన తేదీ వంటి వివరాలు కనిపిస్తాయి. మీరు కొనే బంగారు ఆభరణాలు, బిల్లులతో యాప్‌లోని వివరాలను సరిపోల్చి చూసుకోండి. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే జాగ్రత్త పడండి. ఇక మీకు ఏమైనా అనుమానాలంటే BIS గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాన్ని సంప్రదించి టెస్టింగ్ చేసుకోవచ్చు