
తక్కువ కేలరీలు, జీవక్రియ పెంపు: బ్లాక్ కాఫీలో కేలరీలు దాదాపు శూన్యం. ఇందులో ఉండే కెఫిన్ శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. జీవక్రియ వేగవంతం కావడం వల్ల శరీరం విశ్రాంతిగా ఉన్న సమయంలో కూడా ఎక్కువ కేలరీలను బర్న్ చేయగలుగుతుంది.

క్లోరోజెనిక్ ఆసిడ్ ప్రభావం: బ్లాక్ కాఫీలో లభించే క్లోరో జెనిక్ ఆసిడ్ అనే ముఖ్యమైన కాంపౌండ్ శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది నూతన కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధించడంలో మరియు శరీరంలోని పాత కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఆకలి నియంత్రణ: బ్లాక్ కాఫీ తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది సమయానికి మించి ఆహారం తీసుకోవడాన్ని అరికడుతుంది. ముఖ్యంగా స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు ఆ సమయంలో బ్లాక్ కాఫీ తీసుకుంటే కేలరీల వినియోగం తగ్గుతుంది.

వ్యాయామానికి ముందు ఉత్తమ శక్తి: వర్కౌట్ లేదా ఎక్సర్సైజ్ చేయడానికి 30 నిమిషాల ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది స్టామినాను పెంచి, వ్యాయామం చేసే సమయంలో కొవ్వు వేగంగా కరిగేలా చేస్తుంది.

ప్రయోజనాలు ఉన్నాయని అతిగా తాగకూడదు. రోజుకు 2 నుండి 3 కప్పుల బ్లాక్ కాఫీ మాత్రమే సరిపోతుంది. పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు అసిడిటీ లేదా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది, కానీ ఇది మాత్రమే సంపూర్ణ పరిష్కారం కాదు. బ్లాక్ కాఫీతో పాటు పోషకాహారం తీసుకోవడం, రోజూ సరిపడా నీళ్లు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారానే శాశ్వతంగా బరువు తగ్గవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.