
వాతావరణ మార్పులు, కాలుష్యం, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల చాలామందిలో జుట్టు పొడిబారడం, జీవం కోల్పోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికోసం పార్లర్లలో వేల రూపాయిలు ఖర్చు చేసి హెయిర్ స్పా చేయించుకుంటుంటారు. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే అరటి తొక్కతో మీ జుట్టును పట్టులా మెరిపించుకోవచ్చునని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం...

దాదాపు మనందరం అరటి తొక్కను వ్యర్థంగా భావించి పడేస్తుంటాం. కానీ, ఇందులో పొటాషియం, ఐరన్, విటమిన్ A, B, C, E వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టులోని సహజ తేమను కాపాడతాయి.

పొడిబారడం తగ్గుతుంది: జుట్టులోని ఫ్రిజ్జీనెస్‌ను తగ్గించి సహజమైన మృదుత్వాన్ని ఇస్తుంది. డల్ అయిపోయిన జుట్టుకు తక్షణ మెరుపునుందిస్తుంది. మాడ భాగంలో తేమను పెంచి, చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

అరటి తొక్కతో హెయిర్ మాస్క్ తయారుచేసే విధానం: 2-3 బాగా పండిన అరటి తొక్కలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా పెరుగు లేదా కొబ్బరి నూనె, తేనె కలిపి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి, 30 నుండి 40 నిమిషాల పాటు ఉంచండి.

తరువాత గోరువెచ్చని నీరు, మైల్డ్ షాంపూతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల కొన్ని వారాల్లోనే మీ జుట్టు పొడిబారడం తగ్గి, ఎంతో సాఫ్ట్‌గా, కాంతివంతంగా మారుతుంది. రసాయనాలతో కూడిన ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, ఈ సహజమైన హోమ్ రెమెడీతో అందమైన జుట్టును సొంతం చేసుకోండి.