
ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆదివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొటాంయని పేర్కొంది. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో ఆదివారం (31-05-2026) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్నిప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం 17 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. మన్యం జిల్లా సీతంపేట మండలం, పోలవరం జిల్లా చింతూరు, దేవిపట్నం, కూనవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కృష్ణా జిల్లా ఘంటసాల, మొవ్వ , గుంటూరు జిల్లా కాకుమాను, పొన్నూరు బాపట్ల జిల్లా బాపట్ల, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో(17) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

శనివారం వర్షాలు ఇలా: అనంతపురం జిల్లా హుస్సేన్ పురంలో 51మిమీ, కడప జిల్లా పెద్ద పసుపల్లెలో 45మిమీ, చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7మిమీ, అనంతపురం జిల్లా వెన్నపూసపల్లెలో 31.5మిమీ,కడప జిల్లా ఉప్పలూరులో 29మిమీ, తొర్రివేముల 26మిమీ, పొత్తిపాడులో 26మిమీ,నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 20. 5మిమీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

శనివారం ఉష్ణోగ్రతలు ఇలా: శనివారం నంద్యాల(జి) సంజామలలో 41.4డిగ్రీలు, అనంతపురం(జి) హుస్సేన్ పురంలో 40.2, కర్నూలు(జి) బస్తిపాడు, మార్కాపురం(జి) కంభం, వైఎస్సార్ కడప(జి) మంగపట్నం 40 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.