
ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం నుండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తిరిగిరావాలని సూచించారు.

గురువారం (22-10-2026) ఈ ప్రాంతాల్లో వర్షాలు: ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.