
ధమనుల రక్షణలో బాదం పాత్ర: రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో బాదం పప్పులు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఔన్సు బాదంలో మీ రోజువారీ అవసరానికి సరిపడా విటమిన్ ఇ, 77 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తాయి. ఇందులోని విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, ధమనులలో ఫలకం పేరుకుపోయే అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే మెగ్నీషియం రక్తపోటును, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతూ హృదయ సంబంధిత ఒత్తిడిని నివారిస్తుంది.

వేరుశెనగలతో కొలెస్ట్రాల్‌కు చెక్: ఖరీదైన బాదంతో పోలిస్తే... తక్కువ ధరలో దొరికే పల్లీలు కూడా గుండెకు సమానమైన రక్షణను అందిస్తాయి. వీటిలో అసంతృప్త కొవ్వులతో పాటు ఎక్కువ ప్రోటీన్, నియాసిన్ , ఫోలేట్ ఉంటాయి. ముఖ్యంగా వేరుశెనగపై ఉండే పలుచని తొక్కలో లభించే నియాసిన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వారానికి కనీసం రెండుసార్లు వీటిని తినడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఒత్తిడి - ఆందోళన దూరం: ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి అనేది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన అంశంగా మారింది. అయితే ప్రతిరోజూ పల్లీలు తినే వ్యక్తులలో ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. వేరుశెనగలోని ప్రత్యేకమైన పోషకాలు, జీవక్రియాశీల సమ్మేళనాల మిశ్రమం మానసిక శ్రేయస్సుకు తోడ్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్స్ కాకుండా వీటిని చిరుతిండిగా ఎంచుకోవడం ఉత్తమం.

నట్ బటర్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు: మార్కెట్లో లభించే పీనట్ బటర్, ఆల్మండ్ బటర్‌లను కూడా మన ఆహారంలో చేర్చుకోవచ్చని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిని కొనేటప్పుడు కేవలం నట్స్, కొద్దిగా ఉప్పు మాత్రమే ఉండేలా, సోడియం తక్కువగా ఉన్న బ్రాండ్లను ఎంచుకోవాలి. ఫ్లేవర్ల పేరుతో కలిపే అదనపు చక్కెర లేని వాటిని చూడాలి. అలాగే కేలరీలు పెరగకుండా ఉండాలంటే రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పరిమాణాన్ని మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్పష్టమైన విజేత ఎవరు?: పోషకాహార నిపుణులు ఎహ్సానీ, హెంలర్ అభిప్రాయం ప్రకారం... గుండె ఆరోగ్యానికి ఈ రెండింటిలో స్పష్టమైన విజేత అంటూ ఎవరూ లేరు. బాదం ఇచ్చే లాభాలు బాదానివి, వేరుశెనగ ఇచ్చే లాభాలు వేరుశెనగవి. కాబట్టి మీ బడ్జెట్, రుచి ప్రాధాన్యతను బట్టి మీ రోజువారీ ఆహారంలో వివిధ రకాల నట్స్‌ను కలిపి చేర్చుకోవడమే గుండె ఆరోగ్యానికి అత్యుత్తమమైన మార్గం.