
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ (Akvan) తుఫాను ఎట్టకేలకు తీరం దాటింది. ఇవాళ ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా మధ్య, ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తుఫాను తీరాన్ని తాకి పూర్తిగా తీరం దాటిందని ఏపీఎస్డీఎంఏ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి.

తుఫాను తీరాన్ని తాకిన తర్వాత కూడా దాని ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అధికారుల తదుపరి సూచనలు వెలువడే వరకు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్ర తుపాన్ నుంచి తుపాన్‌గా బలహీనపడి కొనసాగుతుందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో పాటు, పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది. ఇక విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మొత్తంగా, ఉత్తరాంధ్రలోని ఈ ఐదు జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు.

తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే.. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది.