
నల్లకారం గురించి చాలా మంది వినే ఉంటారు. కానీ దాని తయారీ విధానం అందరికీ పర్‌ఫెక్ట్‌గా రాదు. ఖచ్చితమైన కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో.. అందుకు ఏమేం పదార్ధాలు కావాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఎండు మిరపకాయలు, 100 గ్రాములు (సుమారు 25 - 30), ధనియాలు ½ కప్పు, శనగపప్పు ¼ కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15, చింతపండు చిన్న నిమ్మకాయ పరిమాణంలో, కరివేపాకు 2 పెద్ద గుప్పెలు, ఉప్పు తగినంత (సుమారు 2 టేబుల్ స్పూన్లు), నూనె 1 టేబుల్ స్పూన్.. తీసుకోవాలి.

ముందుగా ఎండు మిరపకాయల కాడలు తీసి చిన్న ముక్కలుగా విరిచుకోవాలి. వీటిని పాన్‌లో వేసి నూనె వేసి లేతగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో శనగపప్పు, మినప్పప్పు వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. మంట తక్కువగా ఉంచి బంగారు రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ఈ దినుసుల్లోనే చింతపండు ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి స్వల్పంగా వేయించుకోవాలి. దీంతో కారం పొడికి ప్రత్యేక రుచి వస్తుంది. చివరగా కరివేపాకు వేసి పూర్తిగా తేమ పోయే వరకు వేయించాలి. కరివేపాకు కరకరలాడే స్థితికి రావాలి.

గ్రైండింగ్ కోసం మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఎండు మిరపకాయలు, ఉప్పు వేసి కొద్దిగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసి మెత్తగా లేదా కొద్దిగా దంచినట్టుగా గ్రైండ్ చేయాలి. అంతే రుచికరమైన నల్లకారం రెడీ అయినట్లై..

ఈ కారం చేసేటప్పుడు కరివేపాకులో తేమ ఉండకూడదు. ధనియాల పరిమాణం ఎక్కువగా ఉంటే మంచి సువాసన వస్తుంది. చింతపండు వల్ల స్వల్ప పులుపు వచ్చి కారం రుచి పెరుగుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో నిల్వ చేయాలి. ఈ నల్లకారం వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోసెతో, ఉప్మా, పొంగల్‌తో, గారెలు, బొండాలతో దేనిలో వేసుకుని తిన్నా రుచి అదిరిపోతుంది. అన్నట్లు ఈ నల్లకారం 2 - 3 నెలల వరకు నిల్వ ఉంటుంది.