డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్‌… ఆర్టీజీఎస్ ఇక‌పై 24 గంట‌లు… కోవిడ్ ఎదుర్కొనేందుకు కొత్త నిబంధ‌న‌లు

డిసెంబ‌ర్ నెల‌లో నూత‌న నిబంధ‌న‌లు రానున్నాయి. వివిధ రంగాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూల్స్‌ను మారుస్తూ ప్ర‌భుత్వాలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్రైవేట్ సంస్థ‌లు కొత్త రూల్స్‌ను..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:42 pm, Mon, 30 November 20

డిసెంబ‌ర్ నెల‌లో నూత‌న నిబంధ‌న‌లు రానున్నాయి. వివిధ రంగాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూల్స్‌ను మారుస్తూ ప్ర‌భుత్వాలు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్రైవేట్ సంస్థ‌లు కొత్త రూల్స్‌ను ఫ్రేమ్ చేస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ఆర్టీజీఎస్ ఇక‌పై 24 గంట‌లు

దేశీయంగా న‌గ‌దు త‌క్ష‌ణ బ‌దిలీకి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) సిస్టమ్ ను ఉప‌యోగిస్తారు. భారీగా లావాదేవీలు జరిపేవారికి ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతుంది. డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు కస్టమర్లకు 24 గంటలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కస్టమర్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్‌టీజీఎస్ సేవలు లభిస్తున్నాయి.

కోవిడ్ ను ఎదుర్కొనేందుకు కొత్త రూల్స్‌…

కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త గైడ్‌లైన్స్‌ని ప్రకటించింది ఈ నియమనిబంధనలు డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి. డిసెంబర్ నెలాఖరు వరకు ఇవే రూల్స్ కొనసాగుతాయి.

భార‌త రైల్వే స్పెష‌ల్ రైళ్ల పొడ‌గింపు..

స్పెషల్ ట్రైన్స్ చాలా వరకు నవంబర్ 30 వరకే నడుస్తాయని గతంలోనే ప్రకటించింది. అయితే భారతీయ రైల్వే వాటిలో కొన్ని రైళ్లను డిసెంబ‌ర్ నెల‌కు పొడిగించింది. ఆ జాబితాను కూడా విడుదల చేసింది.

స‌ర‌ళ్ జీవ‌న్ బీమా రానుంది..

స్టాండర్డ్ ఇండివిజ్యువల్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. 2021 జనవరి 1 నుంచి ‘సరళ్ జీవన్ బీమా’ పేరుతో టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని చెప్పింది. అయితే అంతలోపే పాలసీని రూపొందిస్తే ఐఆర్‌డీఏఐ ఆమోదం పొందిన తర్వాత కంపెనీలు పాలసీని అమ్మొచ్చు. అంటే డిసెంబర్‌లోనే ‘సరళ్ జీవన్ బీమా’ పాలసీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్ స‌ర్వీసులు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 1 నుంచి రెండు ఫ్లైట్లను నడపనుంది. విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-తిరుపతి రూట్లలో ఈ ఫ్లైట్స్ నడుస్తాయి. విజయవాడలో మధ్యాహ్నం 1.45 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం చేసుకుంటుంది. విశాఖటప్నంలో మధ్యాహ్నం 3.15 గంటలకు ఫ్లైట్ బయల్దేరి విజయవాడకు సాయంత్రం 4.25 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతిలో మధ్యాహ్నం 12.05 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.50 గంటలకు ఫ్లైట్ బయల్దేరి సాయంత్రం 6.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

పాల‌సీ ప్రీమియం త‌గ్గించి చెల్లించొచ్చు..

మీరు ఐదేళ్లపాటు పాలసీ ప్రీమియం చెల్లించారా? అయితే ప్రీమియం 50 శాతం తగ్గించుకోవచ్చు. సగం ప్రీమియం చెల్లించినా ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ వెసులుబాటు డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.

గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌ల్లోనూ మార్పులు..

ప్రతీ నెల మొదటి రోజు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. ఒకటో తేదీని ప్రకటించిన ధరలే ఆ నెలంతా అమలులో ఉంటాయి. డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలపై గ్యాస్ సిలిండర్ల ధరలు ఆధార పడి ఉంటాయి.