
తప్పు చేసినవాడు ఎక్కడ దాక్కున్నా దొరకక తప్పదు.. కానీ ఒక అధికార పార్టీ నేత ఏకంగా ఆడవాళ్లు కట్టుకునే చీరల కుప్ప కింద దూరి దాక్కున్న విచిత్ర సంఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసింది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల నుండి అక్రమ కమీషన్లు వసూలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హౌరా జిల్లా ఉదయ్‌నారాయణ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ నేత బ్రహ్మానంద చక్రవర్తిని పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. హౌరా జిల్లా బిల్‌సాపూర్ పరిధిలోని ఉదయ్‌నారాయణ్‌పూర్‌లో ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లు మంజూరైన పేద ప్రజల నుండి బ్రహ్మానంద చక్రవర్తి భారీగా కమీషన్లు గుంజాడంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తన కోసం వెతుకుతున్నారనే విషయం తెలుసుకున్న బ్రహ్మానంద.. తప్పించుకోవడానికి సమీపంలోని ఒక బట్టల దుకాణం గోడౌన్‌లోకి దూరాడు. అక్కడ భారీగా పేరుకుపోయి ఉన్న చీరల కుప్ప కింద దూరి నిశ్శబ్దంగా దాక్కున్నాడు.
పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందడంతో ఆ బట్టల గోడౌన్‌ను ముట్టడించారు. అక్కడ తనిఖీలు చేస్తుండగా ఒక చీరల కుప్ప దగ్గర అనుమానం వచ్చి, వాటిని ఒక్కొక్కటిగా పక్కకు జరపగా పర్పుల్ కలర్ షర్ట్ వేసుకుని లోపల దాక్కున్న బ్రహ్మానంద చక్రవర్తి బయటపడ్డాడు. పోలీసులు అతడిని కాలర్ పట్టుకుని బయటకు లాగి, అక్కడికక్కడే బేడీలు వేశారు. ఈ విచిత్రమైన అరెస్ట్ సీన్ అంతా అక్కడున్న వారు కెమెరాల్లో రికార్డ్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్థానిక బీజేపీ నేతల సమాచారం ప్రకారం.. ఇతనిపై 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాతి హింసాత్మక ఘటనలకు సంబంధించిన పాత కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి చవిచూసిన తర్వాత గతంలో అవినీతి, దౌర్జన్యాలకు పాల్పడిన స్థానిక టీఎంసీ నేతలపై ప్రజల్లో ఉన్న కోపం ఒక్కసారిగా బద్దలైంది. బెంగాల్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. జూన్ 6 శనివారం రాత్రి సీనియర్ టీఎంసీ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రా కాన్వాయ్‌పై కలకత్తాలో ప్రజలు కోడిగుడ్లతో దాడి చేశారు. అలాగే దోపిడీ కేసుల్లో అరెస్టయిన కౌన్సిలర్ బప్పాదిత్య దాస్‌గుప్తాను కోర్టుకు తీసుకెళ్తుండగా ప్రజలు గుడ్లు విసిరారు. కోపాగ్ని ఎంతలా ఉందంటే.. కోల్‌కతాలో జరగాల్సిన టీఎంసీ కౌన్సిలర్ల అత్యవసర సమావేశాన్ని సైతం గుడ్ల దాడి భయంతో పార్టీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
అయితే చక్రవర్తి ఘటన మరో అరెస్టును గుర్తుకు తెస్తోంది. కూచ్ బెహార్ జిల్లా మాతాభంగాలో ఇలాగే కట్ మనీ వసూలు చేసిన మరో టీఎంసీ నేత షాహిదుల్ మియాను గ్రామస్థులు తరుముకుంటూ వెళ్లగా.. అతడు తన ఇంట్లోని మంచం కింద దూరి దాక్కున్నాడు. పోలీసులు వచ్చి మంచం కింద నుండి అతడిని లాగి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగాల్‌లో అవినీతి నేతలపై సీబీఐ, ఎన్‌ఐఏ, స్థానిక పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో తప్పించుకోవడానికి నేతలు వెతుకుతున్న ఇలాంటి విచిత్రమైన దాగుడుమూతల దారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
#TMC leader hiding beneath a pile of clothes in Howrah. The individual seen in the viral video is identified as Brahmananda Chakraborty, a local Trinamool leader accused of allegedly taking ‘cut money’ from funds allocated for housing scheme. pic.twitter.com/1uyMZb6MhK
— Pooja Mehta (@pooja_news) June 7, 2026