
ముంబై తూర్పు శివారు ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఓ వ్యక్తి మానవత్వం లేకుండా వ్యవహరించాడు. పిట్ బుల్.. 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. ఐతే అక్కడే ఉన్న కుక్క యజమాని పిల్లవాడికి సాయం చేయడానికి బదులుగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఆటోలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పిల్లాడు ఆటోలో వెనుక భాగంలో కూర్చుని ఉన్నాడు. అతడి పక్కనే కుక్క ఉంది. దాని యజమాని కూడా అక్కడే ఉన్నాడు. పిల్లాడు భయంతో కేకలు వేస్తుంటే ఆ నీచుడు అది చూసి తెగ ఆనందించాడు. దాడి చేస్తున్న కుక్కని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కుక్కపై నియంత్రణ లేకపోవడంతో, చిన్నారి ముఖానికి తీవ్ర గాయం ఏర్పడింది, ముఖ్యంగా గడ్డం వద్ద గాయమైంది. పిల్లాడు ఆటో దిగేసి పరుగులు తీశాడు. తన పెంపుడు శునకం బాలుడి వెంట పరిగెత్తటం చూసి నవ్వుతూ ఉండిపోయాడు. పైగా వారంతా నాపై కుక్క దాడిని వీడియో తీశారని తెలిపాడు. ఈ సంఘటన నేపథ్యంలో, ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగా జూలై 18 తెల్లవారుజామున 3:28 గంటలకు మంఖుర్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ముంబైలోని మంఖుర్డ్ PMGP MHADA కాలనీలో జూలై 17, 2025 రాత్రి 10 గంటల సమయంలో ఓ పెంపుడు కుక్క మైనర్ బాలుడిని కరిచి గాయపరిచింది. ఈ ఘటనపై మంఖుర్డ్ పోలీసులు కుక్క యజమాని మొహమ్మద్ సోహైల్ హసన్ ఖాన్ పై భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 291, 125 మరియు 125(A) కింద కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుదారుడి కుమారుడు భవనం నంబర్ 91A ముందు పార్క్ చేసిన ఆటోరిక్షాలో ఆడుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన సోహైల్ తన గోధుమ రంగు పెంపుడు కుక్కను ఉద్దేశపూర్వకంగా వదిలాడు. కుక్కను రిక్షాలో కూర్చుని తీసుకెళ్లిన సోహైల్… చిన్నారిని కరిచిన తర్వాత కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా, అక్కడే కూర్చొని పిల్లాడిని ఎగతాళి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆశ్చర్యకరంగా, BNS సెక్షన్ 35(3) ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎటువంటి అరెస్టు చేయకపోవడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.