
ఒకప్పుడు పాఠశాలల్లో జుట్టు పొడవుగా ఉంటే ఉపాధ్యాయులు మందలించడం లేదా కత్తిరించుకుని రమ్మని హెచ్చరించడం చూస్తుండేవాళ్లం. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని ఒక ప్రముఖ కేంద్రీయ విద్యాలయంలో (KV) పొడవాటి జుట్టు పెంచాడనే కారణంతో ఏకంగా 8వ తరగతి విద్యార్థికి బదిలీ ధృవీకరణ పత్రం (TC) ఇచ్చి స్కూల్ నుంచి బయటకు పంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కాన్పూర్‌కు చెందిన ఒక మహిళ తన కుమారుడితో కలిసి శుక్రవారం (జూలై 24) జిల్లా మేజిస్ట్రేట్ (DM) జితేంద్ర ప్రతాప్ సింగ్ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌కు వచ్చింది. అతని నానమ్మ మరణించడంతో 20 రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నామని, ఆ తర్వాత కొడుకును లీవ్ లెటర్‌తో పాఠశాలకు తీసుకెళ్తే.. తరగతిలోకి రానివ్వకుండా చేతికి టీసీ ఇచ్చారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని తిరిగి పాఠశాలలో చేర్చుకునేలా న్యాయం చేయాలని వేడుకుంది.
స్కూల్ యాజమాన్యం చెప్పిన 20 రోజుల లీవ్ కారణంపై డిఎం జితేంద్ర ప్రతాప్ సింగ్‌కు అనుమానం వచ్చి, ఆ విద్యార్థిని ఆప్యాయంగా ప్రశ్నించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థికి పొడవాటి జుట్టు పెంచడమంటే తీవ్రమైన ఇష్టం. అయితే క్రమశిక్షణ పాటించాలని, జుట్టు కత్తిరించుకోవాలని స్కూల్ యాజమాన్యం పదేపదే హెచ్చరించినప్పటికీ అతడు వినలేదు. చివరికి ఆ విద్యార్థి ప్రవర్తనను క్రమశిక్షణా రాహిత్యంగా భావించి పాఠశాల అతడిని బహిష్కరిస్తూ టీసీ ఇచ్చింది.
ఈ కారణం విని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లోని వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారు. “ఇది చదువుకుని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసు. పాఠశాలకు వెళ్లేది క్రమశిక్షణతో విద్యను అభ్యసించడానికే తప్ప, పొడవాటి జుట్టుతో ఫ్యాషన్లు చేయడానికి కాదు” అని హితవు పలికారు. ఇలాంటి తప్పు మళ్లీ జరగదని, తామే స్వయంగా కుమారుడి జుట్టును పొట్టిగా కత్తిరిస్తామని ఆ విద్యార్థి కుటుంబం జిల్లా మేజిస్ట్రేట్‌కు హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అతడిని మళ్లీ స్కూల్‌లో చేర్చుకునేలా యాజమాన్యంతో మాట్లాడతానని డిఎం జితేంద్ర ప్రతాప్ సింగ్ వారికి అభయమిచ్చారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..