
ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిపై ఆగ్రహంతో ఓ తండ్రి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కత్తితో దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
బదౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్చా గ్రామానికి చెందిన 19 ఏళ్ల శివాని, మే 18న తన ప్రియుడు లలిత్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో లలిత్ తన కుమార్తెను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ శివాని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంటి నుంచి వెళ్లిన తర్వాత శివాని, లలిత్ ఓ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. శుక్రవారం (జూన్ 12) మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా బరౌండా ప్రాంతంలో వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని బదౌసా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
విచారణ సందర్భంగా శివాని తాను స్వచ్ఛందంగానే లలిత్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నానని, భర్తతోనే కలిసి జీవించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేసింది. ఈ మాటలు విన్న తండ్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆగ్రహావేశంలో అతడు వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తన కుమార్తెపై దాడి చేశాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం యువతిని పలుమార్లు కత్తితో పొడిచాడు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా అడ్డుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనతో పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే స్పందించిన పోలీసులు రక్తస్రావంతో ఉన్న శివానిని సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బండాలోని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటన అనంతరం నిందితుడైన తండ్రిని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. బండా ఎస్పీ పలాష్ బన్సల్ ఘటనను ధృవీకరిస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ దారుణం జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక కన్న కూతురి ప్రాణం తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..