
తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై వివాదం కొనసాగుతోంది. కొండపై ఉన్న దీపత్తూన్ రాతి స్తంభం వద్ద నవంబర్ 28న దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తూ, భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని సూచించింది. దీంతో శనివారం అక్కడ ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ సిబ్బందిని అధికారులు మోహరించారు. గతంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నవంబర్ 24న దీపత్తూన్ వద్ద కాకుండా ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలో మహాదీపం వెలిగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు పేర్కొంది. కాగా, దీపత్తూన్ వద్ద దీపం వెలిగించేందుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
అసలేం జరిగిందంటే..?
తమిళనాడు రాష్ట్రం మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం రగడ తారాస్థాయికి చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కిన తమిళనాడు అధికార యంత్రాంగంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొండపై ఉన్న పురాతన రాతిస్తంభంపై కార్తిక దీపం వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మదురై కలెక్టర్ సహా పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 15కు వాయిదా వేసింది.
ఏళ్లుగా తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్టు శిరస్సుకు పైన ఉన్న ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తుంటారు. అయితే, ఇదే కొండపై ఉన్న సికందర్ దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపై దీపం వెలిగించాలనే డిమాండ్‌తో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. గత ఏడాది మద్రాస్ హైకోర్టు రాతిస్తంభంపైనే దీపం వెలిగించాలని ఆదేశించినా శాంతిభద్రతలు తలెత్తుతాయన్న కారణంతో అది జరగలేదు. దీంతో ఈ వ్యవహారం ఈసారి సుప్రీంకోర్టుకు చేరింది. అయితే… రాతిస్తంభంపై కార్తికదీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కార్తిక పౌర్ణమి నాడు పాత పద్ధతిలోనే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ మండపంపైనే దీపం వెలిగించడం సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమైంది.
కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం… తమిళనాడు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది. కోర్టు ఆదేశాల అమలులో తమిళనాడు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెంటనే ఆలయంతో పాటు తిరుప్పరంకుండ్రం కొండ భద్రతా బాధ్యతలను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్కు అప్పగిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణ సమయంలో కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. రాతిస్తంభం దగ్గరకు వెళ్లేందుకు పోలీసులు తమను అనుమతించలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే, నవంబరు 21 నుంచే తాము ఏఎస్ఐ అధికారులతో సమావేశాలు నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. కొండ దగ్గర 5 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని మదురై పోలీసు కమిషనర్ వివరించారు. అయితే, అధికారుల వాదనలను సుప్రీంకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర పాలనా అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని… కోర్టు ఆదేశాలపై చర్చలకు తావులేదని… న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించేవారు ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా సరే సహించేది లేదు అంటూ ధర్మాసనం ఆగ్రహించింది.
మొత్తంగా… సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం తిరుప్పరంకుండ్రం కొండపై సీఆర్పీఎఫ్ పహారా మధ్య పురాతన రాతిస్తంభంపై కార్తిక దీపం వెలగనుంది. మరోవైపు… కోర్టు ధిక్కరణ నోటీసులపై తమిళనాడు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ దీపం వెలిగించనున్నారు అధికారులు. ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ మండపంపై వెలిగే దీపం నుంచి జ్వాలను తీసుకెళ్లాలని కోర్టు తెలిపింది. దీప జ్వాల కార్యక్రమాన్ని ఇద్దరు హైకోర్టు జడ్జిలు పర్యవేక్షిస్తారు. దర్గాకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగవద్దన్న సుప్రీం కోర్టు.. కొండ భద్రతా బాధ్యతలు CRPFకు అప్పగించింది. దీంతో కేంద్ర బలగాలు కొండకు చేరుకున్నాయి. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో దర్గాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. వ్యక్తిగత గుర్తింపు పత్రాలను పరిశీలించిన తర్వాతే దర్గాకు అనుమతిస్తున్నారు.