Rakeshwar Singh Release: ఎట్టకేలకు జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల.. మధ్యవర్తుల సందేశానికి తలొగ్గిన మావోయిస్టులు

ఎట్టకేలకు అయిదు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ మూడో తేదీ దారుణంగా దాడి చేసి, 24 మంది జవాన్లను హతమార్చిన తర్వాత కిడ్నాప్ చేసిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్‌ను...

Rakeshwar Singh Release: ఎట్టకేలకు జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల.. మధ్యవర్తుల సందేశానికి తలొగ్గిన మావోయిస్టులు
Rakeshwar
Follow us

|

Updated on: Apr 08, 2021 | 7:10 PM

Rakeshwar Singh Released from Maoists kidnap: ఎట్టకేలకు అయిదు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ మూడో తేదీ దారుణంగా దాడి చేసి, 24 మంది జవాన్లను హతమార్చిన తర్వాత కిడ్నాప్ చేసిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్‌ (CRPF COBRA COMMANDO RAKESHWAR SINGH)ను మావోయిస్టు నక్సల్స్ (MAOIST NAXALS) గురువారం (ఏప్రిల్ 8వ తేదీన) వదిలి పెట్టారు. జవాన్ విడుదలను చత్తీస్‌గఢ్ డీజీపీ (CHHATTISGARH DGP) ధృవీకరించారు. మావోయిస్టులతో చర్చలకు ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేయడంతో ఇంకా మధ్యవర్తుల పేర్లను ప్రకటించక ముందే మావోయిస్టులు కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేయడం విశేషం. అతి దారుణంగా జవాన్లను ఊచకోత కోసినందుకు పలువురి నుంచి విమర్శలు రావడం, కోబ్రా కమాండో కుటుంబం నుంచి వచ్చిన కన్నీటి వినతులకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన రావడం వల్లనే మావోయిస్టులు ఓ అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది.

బీజాపూర్‌ (BEEJAPUR) జిల్లా తర్రెం కొండల్లో ఏప్రిల్ మూడో తేదీన వ్యూహాత్మక యూ ఆకారంలో దాడులకు తెగబడి వివిధ భద్రతా దళాలకు చెందిన మొత్తం 24 మందిని మావోయిస్టులు అతి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం ఏడుగురు జవాన్లు కనిపించకుండా పోయారని భద్రతా దళాల కమాండర్లు ప్రకటించారు. వీరిలో కొందరి ఆచూకీ దొరకగా.. మరికొందరు ఇంకా మిస్సింగ్ అని తెలుస్తోంది. ఈ ఏడుగురిలో ఒకడైన సీఆర్‌పీఎఫ్ (CRPF)‌ కోబ్రా జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ను తామే కిడ్నాప్ చేసినట్లు మావోయిస్టులు ఏప్రిల్ అయిదో తేదీన ప్రకటించారు. ఏప్రిల్ ఏడో తేదీన రాకేశ్వర్ సింగ్ తమ వద్ద క్షేమంగా వున్నట్లు మావోయిస్టులు ఫోటో కూడా విడుదల చేశారు. రాకేశ్వర్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ లేఖ కూడా విడుదల చేశారు. అయితే.. రాకేశ్వర్ సింగ్ విడుదలకు మావోయిస్టులు ఓ కండీషన్ పెట్టారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమనే ప్రతిపాదనను మావోయిస్టులు ముందుకు తెచ్చారు. చర్చలకు అంగీకరించడంతోపాటు మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే.. మావోయిస్టులతో చర్చలకు ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. మావోయిస్టులు ముందుగా ఆయుధాలను వదిలితేనే చర్చలకు అవకాశం వుంటుందన్న పోలీసు విధానానికే చత్తీస్‌గఢ్ ప్రభుత్వం (CHHATTISGARH GOVERNMENT) మొగ్గు చూపింది.

ఈ నేపథ్యంలో రాకేశ్వర్ సింగ్ విడుదల మరింత జఠిలమైపోతుందన్న ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. అయితే చర్చల ప్రతిపాదన, మధ్యవర్తుల ప్రకటన డిమాండ్లను పక్కన పెట్టేసిన మావోయిస్టులు.. గురువారం సాయంత్రం రాకేశ్వర్ సింగ్‌ను వదిలేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగక ముందే రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేసిన మావోయిస్టులు అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా రాకేశ్వర్ సింగ్‌ విడుదలను ధృవీకరించిన చత్తీస్‌గఢ్ డీజీపీ.. అతన్ని ఎక్కడ ఎలా వదిలేశారన్న విషయాన్ని మాత్రం వివరించనే లేదు. కోబ్రా జవాన్ విడుదల కోసం పద్మశ్రీ ధర్మపాల్ శైని, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెలం బోరయ్య, ఇద్దరు బృందంతో పాటు బస్తర్‌కు చెందిన 7 గురు జర్నలిస్టులు మావోయిస్టులతో మధ్యవర్తిత్వం జరిపారని తెలుస్తోంది. దాంతో దండకారణ్యంలో వందలాదిమంది గ్రామస్థులు, మధ్యవర్తిత్వం వహించిన బృందం సమక్షంలో రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేశారని సమాచారం. ప్రతినిధుల బృందంతో పాటు బాసగుడా (BASAGUDA)కు రాకేశ్వర్ చేరే అవకాశముంది. కాగా రాకేశ్వర్ సింగ్ స్వగ్రామం జమ్మూకాశ్మీర్ (JAMMU KASHMIR)‌లో వుంది. 2011లో విధులలో చేరాడు రాకేశ్వర్.

ఇలాంటి ఉదంతాలు గతంలో..?

దేశంలో నక్సల్ ఉద్యమం (NAXAL REVOLUTION) ప్రారంభమైనప్పట్నించి ఎన్నో మార్లు ఎందరినో కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు నక్సల్స్. 2004లో పీపుల్స్ వార్ గ్రూపు (PEOPLE’S WAR GROUP) , మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌లో విలీనమైన తర్వాత నక్సల్స్ హింసోన్మాదం మితి మీరిపోయింది. దాంతో కిడ్నాపులు తగ్గి.. దారుణ హత్యోదంతాలు పెరిగిపోయాయి. ఈక్రమంలో 2004కి ముందు, ఆ తర్వాత జరిగిన కొన్ని కిడ్నాప్ ఉదంతాలను పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 1987 డిసెంబర్‌లో తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి (MAREDUMILLI) అడవులలోని గుర్తేడులో ఏడుగురు ఐ.ఏ.ఎస్‌. అధికారులు, నలుగురు జిల్లా స్థాయి అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. నిజాయితీపరునిగా పేరు గాంచిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ (S R SHANKARAN) అందులో ఒకరు. అడవుల్లో విందు వినోదాలలో మునిగిన అధికారులను నక్సల్స్ కిడ్నాప్ చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.

1989లో నిజామాబాద్ (NIZAMABAD)‌ జిల్లా రామడుగు అటవీ ప్రాంతంలో మాజీమంత్రి, తెదేపా నేత మండవ వెంకటేశ్వరరావు (MANDAVA VENKATESHWAR RAO)ను పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ కిడ్నాప్‌ చేశారు. దాంతో మండవ సతీమణి నళిని సారథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు నిరసనోద్యమం ప్రారంభించారు. దాంతో నక్సల్స్ మండవ వెంకటేశ్వర్ రావును విడుదల చేశారు. 2003 జనవరి 30న పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ని కిడ్నాప్ చేశారు. అయితే ప్రభుత్వం చర్చలు జరిపి అతన్ని విడుదలకు చర్యలు చేపట్టింది. దాంతో ఆ ఎస్ఐ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరిగి అదే సంవత్సం ఏప్రిల్ 9వ తేదీన ముగ్గురు పోలీసులను పీపుల్స్ వార్ గ్రూపు కిడ్నాప్ చేసింది. రెండ్రోజుల తర్వాత ఏప్రిల్ 11వ తేదీన ముగ్గురు పోలీసులను ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద విడుదల చేశారు. దాంతో ఎస్‌.ఐ. ఆంజనేయలు, అసెస్టింట్‌ ఎస్‌.ఐ (కమ్యూనికేషన్స్‌) ఎం.సుబ్బారావు, కానిస్టేబుల్‌ ఎస్‌.బ్రహ్మేంద్రరావులు నల్లమల అడవుల గుండా తిరిగి వచ్చారు.

అయితే వీరి విడుదలకు ప్రభుత్వం ముందు పెట్టిన షరతులకు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం (CHANDRABABU GOVERNMENT) ఓకే చెప్పడంతో పోలీసుల విడుదలకు మార్గం సుగమమైంది. 48 గంటల గడువుతో ఆనాడు నక్సల్స్ షరతు విధించారు. నల్లమల అటవీ ప్రాంతం (NALLAMALA FOREST)లో పోలీసుల గాలింపు చర్యలను నిలిపి వేయాలని, గిరిజనులను వేధించకూడదని ఆనాడు నక్సల్స్ షరతులు విధించారు. ఈ మేరకు పౌర హక్కుల నేతలతో ప్రభుత్వానికి నక్సల్స్ సందేశం పంపారు. దాంతో అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు (CM CHANDRABABU NAIDU) నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నక్సల్స్ విధించిన రెండు షరతులకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో నక్సల్స్ పోలీసు సిబ్బందిని విడుదల చేశారు.

2004లో మావోయిస్టులుగా అవతరించిన నక్సల్స్ చాలా కాలం పాటు హత్యాకాండలకే ప్రాధాన్యమిచ్చారు. 2011లో మల్కన్ గిరి (MALKANGIRI) జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ, జూనియర్ ఇంజనీర్ పవిత్ర మాఝులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. వీరి విడుదలకు ప్రొఫెసర్ హరగోపాల్ (PROF HARAGOPAL), సోమశేఖర్ మధ్యవర్తిత్వం జరిపారు. మావోయిస్టులు పెట్టిన పద్నాలుగు షరతులను ఒడిశా ప్రభుత్వం (ODISHA GOVERNMENT) ఒప్పుకోవడంతో కలెక్టర్ వినీల్ కృష్ణ (COLLECTOR VINEEL KRISHNA)ను, జేఈ పవిత్రను మావోయిస్టులు విడుదల చేశారు. 2012లో ఛత్తీస్‌గఢ్‌లో ఐఏఎస్ అధికారి అలెక్స్ పాల్ మీనన్ (ALEX PAUL MENON)‌ను అపహరించారు మావోయిస్టులు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. మావోయిస్టులతో చర్చలు జరిపి అలెక్స్ పాల్‌ను విడుదల చేయించింది.

2015 జనవరి 14న చత్తీస్‌గఢ్‌లో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేస్తున్న 50 మంది సర్పంచ్‌ అభ్యర్ధులు, వారి అనుచరులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయవద్దని హెచ్చరించారు. పోటీ చేస్తే తీవ్ర పరిణామలుంటాయని హెచ్చరించి వారందరినీ నాలుగు రోజుల తర్వాత విడిచి పెట్టారు. అదే సంవత్సరం నవంబర్ నెలలో పలువురు టీఆర్ఎస్ (TRS) పార్టీ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా భద్రాచలం టీఆర్ ఎస్ ఇన్ ఛార్జ్ రామకృష్ణ, చర్ల, వాజేడు, వెంకటాపురానికి చెందిన నేతలు పటేల్ వెంకటేశ్వర్లు, సురేష్ , జనార్థన్, సత్యనారాయణలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం బూచగుప్పలో ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామస్థులతో టీఆర్ఎస్ నేతలు (TRS LEADERS) చర్చలు జరుపుతుండగా సడన్‌గా దాడి చేసిన మావోయిస్టులు వారిని చెరబట్టారు. అయితే వారందనీ నవంబర్ 21వ తేదీన వదిలేశారు. ఖమ్మం జిల్లా పూసుగుప్ప అటవీ ప్రాంతంలో వీరిని వదిలి వేయడంతో వారందరు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు.

2017లో సుక్మా జిల్లాలోని కిస్తారాం ప్రాంతంలో కెనడియన్ జాతీయుడు జాన్ స్లాజాక్‌ను మావోయిస్టులు బంధించారు. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి జాన్ స్లాజక్‌ను విడిపించింది. 2020 జూన్‌ 26న సుక్మా జిల్లా జేగురుకొండకు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ సంతోష్ కట్టమ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న సంతోష్ కట్టమ్ కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అతని భార్య సునీత దీన వేడ్కోలుతో కరిగి వదిలేశారు. కానిస్టేబుల్‌ సంతోష్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.

ALSO READ: రెండో దశలో రెచ్చిపోతున్న కరోనా.. ఓవైపు వైరస్.. ఇంకోవైపు వ్యాక్సిన్ కొరత

ALSO READ: ఏపీ, ఒడిశాల మధ్య ఓ గ్రామం.. గ్రామంలోని ప్రతీ ఒక్కరికీ రెండు ఓట్లు.. ఎందుకంటే?

Latest Articles